logo

ఓట్ల లెక్కింపులో అవకతవకలు అవాస్తవం

‘ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయన్న మాటల్లో వాస్తవం లేదని, రేయింబవళ్లు ఎంతో కష్టపడి ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి నిక్కచ్చిగా విధులు...

Published : 21 Mar 2023 03:35 IST

మాట్లాడుతున్న ఐకాస జిల్లా అధ్యక్షుడు దివాకర్‌రావు, నాయకులు కుళ్లాయప్ప, పీఎస్‌ ఖాన్‌, తదితరులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయన్న మాటల్లో వాస్తవం లేదని, రేయింబవళ్లు ఎంతో కష్టపడి ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి నిక్కచ్చిగా విధులు నిర్వర్తించిన అధికారులపై నిందలు వేయడం సరికాదని ఏపీ ఐకాస అమరావతి జిల్లా ఛైర్మన్‌ దివాకర్‌రావు, సెక్రటరీ జనరల్‌ పీఎస్‌ ఖాన్‌, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప అన్నారు. సోమవారం అనంత కృష్ణకళా మందిర్‌లోని రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. వైకాపా అభ్యర్థి రవీంద్రారెడ్డి ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని తప్పు పట్టడం తమను ఎంతో బాధిస్తోందన్నారు. కలెక్టర్‌, ఎస్పీ, కొందరు అధికారులు తెదేపా అభ్యర్థికి అనుకూలంగా పని చేశారన్న రీతిలో వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఈనెల 9 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ దాకా విధి నిర్వహణలో నల్లబ్యాడ్జీలు ధరిస్తామని, స్వయానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి, కలెక్టర్‌ నాగలక్ష్మికి నోటీసు ఇచ్చామని చెప్పారు.

నేటి నుంచి వర్క్‌ టు రూల్‌

ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 21 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ దాకా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, విధి నిర్వహణలో వర్క్‌ టు రూల్‌ అమలు చేస్తామని ప్రకటించారు. ఇది నిరసనలో భాగమేనన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో తహసీల్దారు, రెవెన్యూ ఉద్యోగులు తప్పక పాటిస్తారన్నారు. ప్రజలు ముందుగానే గమనించాలన్నారు.ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటలు దాకా మాత్రమే పని చేస్తారన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి మారుతీప్రసాద్‌రెడ్డి, కలెక్టరేట్‌ విభాగం అధ్యక్షుడు సోమశేఖర్‌, ఉపాధ్యక్షుడు అక్రం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని