logo

నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు

ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తోందని, అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ఏపీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు.

Updated : 21 Mar 2023 06:37 IST

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

పుట్టపర్తి, న్యూస్‌టుడే : ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తోందని, అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ఏపీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలో గణేశ్‌ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రదర్శన, అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ విజయవాడలో జరిగే మహాధర్నాకు తరలి వెళ్లకుండా ఇళ్లకు వెళ్లి కార్యకర్తలు, సహాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం కన్నా.. వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని, ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారని, నేటికీ ఆచరణలో అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం అణచివేత, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనాలు ఇవ్వాలని, ముఖచిత్రం విధానం రద్దు చేయాలని, జీఓ నం:1ని వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణను సచివాలయాల పరిధిలోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలను ప్రభుత్వం స్పందించి, పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తర్వాత ఆర్డీవో భాగ్యరేఖకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి దిల్షాద్‌, ఏపీ అంగన్‌వాడీ, సహాయకుల సంఘం ప్రతినిధులు శిరీష, సుశీలమ్మ, మణేమ్మ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని