logo

బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం

బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు. బీసీలకు కష్టమొస్తే అండగా నిలిచేది, భవిష్యత్తులో ఆదుకోవాలన్నా భరోసానిచ్చేది తెదేపానేనని, అందుకు బీసీలు మద్దతుగా నిలబడాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 03:46 IST

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ హామీ

కదిరి పట్టణంలో లోకేశ్‌ పాదయాత్రలో కందికుంట వెంకటప్రసాద్‌, అత్తార్‌ చాంద్‌బాషా, పరిటాల శ్రీరామ్‌ తదితరులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, కదిరి, న్యూస్‌టుడే: బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు. బీసీలకు కష్టమొస్తే అండగా నిలిచేది, భవిష్యత్తులో ఆదుకోవాలన్నా భరోసానిచ్చేది తెదేపానేనని, అందుకు బీసీలు మద్దతుగా నిలబడాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర 48వ రోజు సోమవారం ఉదయం జోగన్నపేట నుంచి అల్లుగుండు, మొటుకుపల్లి, కౌలేపల్లి, బేరిపల్లి క్వార్టర్స్‌, నిజాంవలీ కాలనీ, జీమాను సర్కిల్‌, ఇక్బాల్‌రోడ్డు మీదుగా పార్థసారథి కాలనీ వరకు కొనసాగింది. కదిరి మండలం కౌలేపల్లి వద్ద పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్ల్‌ో బీసీ సామాజికవర్గ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వడ్డెర, పట్ర, నాయీబ్రాహ్మణ, గౌడ తదితర కులాలకు సంబంధించి ప్రజలు తాము పడుతున్న కష్టాలను లోకేశ్‌కు వివరించారు. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలు తదనంతర పాలనతో ఎదురైన పరిణామాలు, పడుతున్న ఇబ్బందులను అభిమాన నాయకుడితో ఏకరవుపెట్టుకున్నారు. పాత పథకాల పునరుద్ధరణ, బలహీనవర్గాలకు రక్షణ, ఉపాధి అవకాశాల మెరుగుకు చర్యలతోపాటు రాజకీయ చైతన్యానికి అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన జనం సమస్యలు విన్నారు. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని లోకేశ్‌ వారికి సమాధానం ఇచ్చారు.

దివ్యాంగులతో ముచ్చట్లు..

యువగళం పాదయాత్రలో భాగంగా మార్గమధ్యంలో కదిరి మండలం మొటుకుపల్లిలో ఆర్డీటీ ఏర్పాటు చేసిన బధిర పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న దివ్యాంగులను లోకేశ్‌ కలిశారు. సరదాగా వారితో కాసేపు ముచ్చట్లు పెట్టారు. పిల్లలకు మిఠాయిలు అందజేసి ఆప్యాయతతో పలకరించారు. ఈ సందర్భంగా చిన్నారులు లోకేశ్‌ కుమారుడు దేవాన్ష్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆర్డీటీ డైరెక్టర్‌ దశరథ్‌ మాట్లాడుతూ అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో దివ్యాంగుల అభివృద్ధికి సేవాకార్యక్రమాలు చేస్తున్నట్లు లోకేశ్‌కు వివరించారు.

మోటుకపల్లిలో ఆర్డీటీ బధిరుల పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటిస్తున్న లోకేశ్‌

ఖాద్రీశుడి దర్శనం..

సాయంత్రం 7 గంటల సమయంలో నారాలోకేశ్‌ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం భృగుతీర్థం (కోనేరు) పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. డీఎస్పీ కార్యాలయం ఎదురుగా విడిది కేంద్రం ఏర్పాటు చేశారు. పాదయాత్రలో లోకేశ్‌ వెంట కదిరి ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, పరిటాల శ్రీరామ్‌, మాజీ జడ్పీ ఛైర్మన్‌ పూలనాగరాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, అంబికా లక్ష్మీనారాయణ, నాగప్ప, గంగయ్య, శంకర తదితరులు పాల్గొన్నారు.


నేటి పాదయాత్ర వివరాలు

కదిరి: తెదేపా యువనేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర వివరాలు.. ఇప్పటి వరకు నడిచిన దూరం 612.5 కి.మీ. సోమవారం 9.8 కి.మీ. దూరం నడక సాగించారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లాలో పాదయాత్ర సాగనుంది. ఉదయం 8 గంటలకు కదిరి ఆర్డీవో ఆఫీసు వద్ద విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 8.15కు గట్ల వద్ద టిడ్కో గృహాల పరిశీలన, లబ్ధిదారులతో బేటీ, 8.45 గంటలకు అలీపూర్‌తండా వాసులతో మాటామంతి, 10.40 గంటలకు ముత్యాలచెరువు మాటామంతి, 11.30కు అక్కడే భోజన విరామం, 12.30 గంటలకు ముత్యాలచెరువు ప్రాంతం నుంచి బయల్దేరి 3.30కి పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. 3.45 గంటలకు పులగంపల్లిలో జనంతో మాట్లాడతారు. 4.45 గంటలకు వనికివారిపల్లి క్రాస్‌ వద్ద విడిది కేంద్రంలో బస చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు