logo

అన్నదాత గుండెకోత

జిల్లాలో మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో పంటలకు భారీగా నష్టం జరిగింది. మొత్తంగా రూ.93 కోట్ల విలువైన పంటలను కోల్పోవడంతో రైతులకు కన్నీటి కడగండ్లు మిగిల్చింది.

Updated : 21 Mar 2023 06:35 IST

భారీగా దెబ్బతిన్న ఉద్యాన పంటలు
అనంతలో రూ.93 కోట్లపైగా నష్టం

విరిగిన అరటి మొక్కలు

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో పంటలకు భారీగా నష్టం జరిగింది. మొత్తంగా రూ.93 కోట్ల విలువైన పంటలను కోల్పోవడంతో రైతులకు కన్నీటి కడగండ్లు మిగిల్చింది. ప్రధానంగా ఉద్యానపంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన అరటి నేలకొరిగింది. చీనీ, నిమ్మ చెట్లు విరగపడ్డాయి. మామిడి కాయలు రాలిపోయాయి. కలింగర, కర్బూజ, టమోటా, కూరగాయలు తోటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు కళ్లెదుటే నిలువునా కూలడంతో సర్వం కోల్పోయామని ఉద్యాన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉరవకొండ, కూడేరు, అనంతపురం గ్రామీణం, గార్లదిన్నె, గుంతకల్లు, గుత్తి, పామిడి, రాయదుర్గం, బొమ్మనహాళ్‌, నార్పల, యల్లనూరు, పుట్లూరు, రాప్తాడు, శింగనమల మండలాల పరిధిలోని 1,599 మంది ఉద్యాన రైతులకు సంబంధించి 1,938 హెక్టార్లలో రూ.76.18 కోట్లు నష్టం వాటిల్లిందని జిల్లా ఉద్యానశాఖ అధికారి రఘునాథరెడ్డి తెలిపారు. ప్రధానంగా అరటి 1,108 హెక్టార్లలో రూ.66.55 కోట్లు, మిరప 170 హెక్టార్లలో రూ.66 లక్షలు, మామిడి 178 హెక్టార్లలో రూ.2.91 కోట్లు, చీనీ 280 హెక్టార్లలో రూ.3.57 కోట్లు, టమోటా 76 హెక్టార్లలో రూ.కోటి నష్టం కలిగింది.  నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు డీడీహెచ్‌ తెలిపారు.

ఇతర పంటలు..: వరి, మొక్కజొన్న, కొర్ర, జొన్న, తదితర పంటలకు భారీగా నష్టం జరిగింది. పుట్లూరు, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, పెద్దవడుగూరు, శింగనమల, అనంతపురం గ్రామీణం, గుంతకల్లు, తాడిపత్రి, పామిడి, యల్లనూరు, రాప్తాడు, విడనపనకల్లు, పెద్దపప్పూరు, గుత్తి, బొమ్మనహాళ్‌, కూడేరు మండలాల పరిధి 92 గ్రామాల్లో 3,010 హెక్టార్లలో రూ.17.4 కోట్లు పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయాధికారి చంద్రనాయక్‌ తెలిపారు. అందులో వరి 680 హెక్టార్లలో రూ.6.5  కోట్లు, మొక్కజొన్న 1,813 హెక్టార్లలో రూ.8.2 కోట్లు, కొర్ర 221 హెక్టార్లలో రూ.కోటి, జొన్న 165 హెక్టార్లలో రూ.8 లక్షల మేరకు రైతులు నష్టపోయారు. ఈమేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.


ఆశలన్నీ అరగంటలో ఆవిరి..
- మధుసూదన్‌రెడ్డి, అరటి రైతు, దోసలేడు, పుట్లూరు మండలం

పదేళ్ల కాలంలో చేసిన అప్పులన్నీ తీరుతాయని నెల రోజులుగా వేచి ఉన్నా. ఆశలన్నీ అరగంటలోనే ఆవిరయ్యాయి. నాలుగున్నర ఎకరాల్లో రూ.10 లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన పంట పడిపోయింది. టన్ను రూ.25 వేలతో వ్యాపారులు అడిగినా ఇవ్వలేదు. దాదాపు వంద టన్నుల పంట నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోకపోతే జీవనం కష్టమే.


1.5 టన్నుల కాయలు రాలిపోయాయి
- గోవిందరాజులు, రైతు, మల్లాపురం

4.5 ఎకరాల్లో 320 మామిడి మొక్కలు నాటాను. అకాల వర్షానికి ప్రతి చెట్టు నుంచి 10కిలోల చొప్పున సుమారు ఒకటిన్నర టన్నుల వరకు మామిడి కాయలు రాలిపోయి అపార నష్టం వాటిల్లింది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని