logo

గుత్తి- పెండేకల్లు బైపాస్‌లైన్‌కు రూ.351 కోట్లు

భారత రైల్వేలో మొట్టమొదట లెవల్‌ క్రాసింగులు లేకుండా నిర్మించిన గుత్తి- పెండేకల్లు బైపాస్‌ సింగిల్‌లైన్‌కు తోడుగా డబుల్‌లైన్‌ను నిర్మించడానికి ప్రభుత్వం రూ.351.80 కోట్లను కేటాయించినట్లు డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి తెలిపారు.

Published : 24 Mar 2023 06:05 IST

మాట్లాడుతున్న డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి, అధికారులు

గుంతకల్లు, న్యూస్‌టుడే: భారత రైల్వేలో మొట్టమొదట లెవల్‌ క్రాసింగులు లేకుండా నిర్మించిన గుత్తి- పెండేకల్లు బైపాస్‌ సింగిల్‌లైన్‌కు తోడుగా డబుల్‌లైన్‌ను నిర్మించడానికి ప్రభుత్వం రూ.351.80 కోట్లను కేటాయించినట్లు డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి తెలిపారు. గుంతకల్లులోని డీఆర్‌ఎం కార్యాలయంలోని సమావేశపు మందిరంలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సెక్షన్‌లోని 29.2 కి.మీ.లు డబుల్‌లైన్‌ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. సికింద్రాబాద్‌, బెంగళూరులకు త్వరగా రైళ్లు చేరుకోవడానికి ఈ డబుల్‌లైన్‌ మార్గం ఉపయోగపడుతుందన్నారు. గుంటూరు- గుంతకల్లు సెక్షన్‌లో జరుగుతున్న డబుల్‌లైన్‌ పనుల్లో భాగంగా గుంతకల్లు శివారులో నిర్మిస్తున్న బైపాస్‌లైన్‌ పనులు జులై నాటికి పూర్తవుతాయని చెప్పారు. ఎర్రగుంట్లలో నిర్మిస్తున్న బైపాస్‌లైన్‌ పనుల సర్వేను గతిశక్తి విభాగం ఇంజినీర్లు చేపట్టారన్నారు. తిరుపతి- పాకాల, పాకాల- కాట్పాడి మధ్య డబుల్‌లైన్లను నిర్మించడానికి ప్రస్తుతం సర్వే జరుగుతోందని చెప్పారు. ధర్మవరం- పాకాల మధ్య డబుల్‌లైన్‌ను నిర్మించాల్సి ఉందని, రైళ్ల రాకపోకలకు అనుగుణంగా పనులను చేపడతామని తెలిపారు. గుంతకల్లులోని జంక్షన్‌లో అన్ని ప్లాట్‌ఫారాలకు చెందిన లైన్లను అనుసంధానం చేసే పనులను చేపట్టాల్సి ఉందన్నారు. ధర్మవరం రైల్వేగేటు వద్ద రోడ్డు అండర్‌ వంతెనను నిర్మించడానికి సర్వేను పూర్తిచేసి నిధుల మంజూరుకు ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. ప్రస్తుతం నంద్యాల - గుంటూరు మధ్య డబుల్‌లైన్‌ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఏడీఆర్‌ఎం సుధాకర్‌, సీనియర్‌ డీఓఎం శ్రావణ్‌కుమార్‌, సీనియర్‌ డీసీఎం ప్రశాంత్‌కుమార్‌, ప్రోటోకాల్‌ ఫిర్యాదుల విభాగం ఇన్‌స్పెక్టర్‌ మురళీధర, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ హేమంత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని