logo

ట్యాబ్‌ పాఠాలు.. నిర్వహణ లోపాలు!

ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన బైజూస్‌ ట్యాబ్‌లు సక్రమంగా పనిచేయడం లేదు. అనంతపురం జిల్లాలో 21,632 మంది విద్యార్థులు, 3,991 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు.

Published : 24 Mar 2023 06:05 IST

అనంతపురం విద్య, న్యూస్‌టుడే

ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన బైజూస్‌ ట్యాబ్‌లు సక్రమంగా పనిచేయడం లేదు. అనంతపురం జిల్లాలో 21,632 మంది విద్యార్థులు, 3,991 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. వాటి వినియోగం, నిర్వహణపై శిక్షణ ఇవ్వలేదు. కొందరు పాఠాలు పక్కన పెట్టి, యూట్యూబ్‌ వీడియోల కోసం ప్రయత్నించడంతో బైజూస్‌ కంటెంట్‌ తొలగిపోయింది. మరికొన్ని ట్యాబ్‌లలో ఎర్రర్‌ వస్తోందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తున్నారు. పాడైన ట్యాబ్‌లు మరమ్మతు చేయడానికి ఇటీవల నిపుణులు వచ్చారు. బడిలో నేర్చుకొన్న పాఠాలను విద్యార్థులు ఇంటికెళ్లి.. మరిన్ని అంశాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేశారు. నిర్వహణ, పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో కార్యక్రమం గాడి తప్పుతోంది. ఇప్పటి వరకు ట్యాబుల్లో గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల పాఠాలు వస్తున్నాయి. ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ పాఠాలు రావడంలేదు. విద్యార్థులు రోజుకు కనీసం 2 గంటల సేపు ట్యాబ్‌లో పాఠాలు నేర్చుకోవాలని.. పాఠశాలకూ తీసుకొని రావాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థులు తెచ్చినా... వాటి ద్వారా బోధించడంలేదు. కొందరు ఇంటర్నెట్‌ కోసం ట్యాబ్‌లో సిమ్‌ అమర్చడానికి ప్రయత్నించారు. ఇతర అంశాల కోసం శోధిస్తుండటంతో పాడవుతున్నాయి. ప్రచారం కోసం ట్యాబ్‌లు పంపిణీ చేశారని.. వాటి నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

సచివాలయ సిబ్బందికి మరమ్మతు బాధ్యత

విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లు పాడైతే పాఠశాల సమీపంలో, లేదంటే ఇంటికి సమీపంలో ఉన్న వార్డు/గ్రామ సచివాలయంలో సమాచారం అందించాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. పాడైన వాటిని అందజేస్తే, వార్డు కార్యదర్శి వాటిని బాగు చేయించి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది.


కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కస్తూరీ విద్యాలయంలో 8వ తరగతి విద్యార్థినులకు పంపిణీ చేసిన బైజూస్‌ ట్యాబ్‌లు పని చేయలేదు. దీంతో వాటిని డీఈవో కార్యాలయానికి తీసుకొచ్చారు. అధికారులు వాటిని మరమ్మతు చేయించారు. రెండు రోజుల్లో 980 ట్యాబులను సరిచేశారు.


అనంతపురం కోర్టు రోడ్డులోని నగరపాలక పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాబ్‌ల వినియోగంపై ఆరా తీశారు. సక్రమంగా పనిచేయడం లేదని, ఉపాధ్యాయులు తమకు చెప్పడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తమకు ట్యాబ్‌లపై అవగాహన లేదని ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు.


కొరవడిన పర్యవేక్షణ

ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకొంటున్నారా.. లేదా.. పరీక్షలు ఎలా రాస్తున్నారు. విద్యార్థుల సమాధానాలు ఎలా ఉన్నాయి... తదితర అంశాలను పర్యవేక్షించేవారు లేరు. శిక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించలేదు. విద్యార్థులు ట్యాబ్‌లు ఎన్నిగంటలు వినియోగించారో వాటి వివరాలు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ట్యాబ్‌ల నిర్వహణపై ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇవ్వలేదు.


వినియోగించేలా చర్యలు

ట్యాబ్‌లు పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలకు ట్యాబ్‌లు తీసుకురావాలని.. విద్యార్థులకు ఇళ్లకు వెళ్లి.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించాం. ఎక్కడైనా పాడైతే వెంటనే బాగు చేయిస్తున్నాం.

సాయిరాం, జిల్లా విద్యాశాఖ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు