logo

కాలువ నీరున్నా.. ప్రయోజనం సున్నా!

ముదిగుబ్బ మండలం చుట్టూ నీరున్నా అన్నదాతలకు మాత్రం సాగునీటి కష్టాలు తీరడం లేదు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ నీరు వెళ్తున్నా చెరువులకు నింపకపోవడంతో ఏటేటా పంటల సాగు తగ్గిపోతోంది.

Published : 24 Mar 2023 06:05 IST

వలసబాటలో గ్రామస్థులు

ముదిగుబ్బలో నీరు ఇలా..

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బ మండలం చుట్టూ నీరున్నా అన్నదాతలకు మాత్రం సాగునీటి కష్టాలు తీరడం లేదు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ నీరు వెళ్తున్నా చెరువులకు నింపకపోవడంతో ఏటేటా పంటల సాగు తగ్గిపోతోంది. ఇక్కడి ప్రజలు ఉపాధి దొరక్క బెంగళూరు, పులివెందుల ప్రాంతాలకు వలసపోవడం ఇక్కడ పరిపాటిగా మారుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద మండలం ముదిగుబ్బ. 86 గ్రామాలు, 62 వేల మంది జనాభా ఉన్నారు. అడవిబ్రాహ్మణపల్లితండా సమీపంలో 1 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన యోగివేమన జలాశయం కింద 12 వేల ఎకరాల ఆయకట్టుకి నీరందుతోంది. ఏటా వర్షాకాలంలో జలాశయం గేట్లు ఎత్తడంతో వేల క్యూసెక్కుల నీరంతా వృథాగా చిత్రావతిలోకి పోతోంది. ఆయకట్టు భూములు సాగునీటితో కళకళలాడుతున్నా మిగిలిన గ్రామాల్లో మాత్రం సేద్యానికి సాగునీటి కొరత ఏర్పడింది. ప్రధాన ఆధారమైన హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ నీటితోనైనా చెరువులు నింపితే భూగర్భజలాలు పుష్కలంగా లభించి వ్యవసాయం సాగుతోనైనా వలసలు తగ్గే అవకాశముంది. ముదిగుబ్బ-బుక్కపట్నం సరిహద్దులో 2.41 టీఎంసీల సామర్థ్యంతో నూతనంగా జలాశయాన్ని నిర్మిస్తున్నా కొండగట్టుపల్లి నుంచి మల్లేపల్లి పంచాయతీ వరకు ఉన్న 15గ్రామాల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ముదిగుబ్బ మండలంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద 14వ ప్యాకేజీతో మలకవేముల నుంచి నాగారెడ్డిపల్లి వరకు 2 కిలోమీటర్లు కాలువ నిర్మించారు. రెండు గ్రామాల పరిధిలో నీరు పోతున్నా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 14వ ప్యాకేజీ కింద రెండో విడత కదిరి మండలంలోని పట్నం నుంచి తలుపుల మండలం ఓబుళరెడ్డి గ్రామం వరకు నిర్మించారు. ముదిగుబ్బ సరిహద్దు మీదుగా కాలువ నీరు వెళ్తున్నా చెరువులు నింపడంలేదు. కాలువ కింద కొండగట్టుపల్లి, చెంచుగారిపల్లి, చెంచుగారిపల్లితండా, మద్దన్నగారిపల్లి, పైపేడు, పెద్దన్నగారిపల్లి, తప్పెటవారిపల్లి, సిరిగారిపల్లి, సీలోళ్లపల్లి గ్రామాల చెరువులకు నీరందడం లేదు.


పొలం వదిలేసి బెంగళూరుకు వచ్చాం

మాకున్న ఏడెకరాల భూమిలో వేరుసెనగ, ఇతర పంటలు సాగుచేసేవాళ్లం. క్రమంగా భూగర్భ జలాలు తగ్గిపోవడం, నష్టాలు రావడంతో వ్యవసాయం వదిలేయాల్సి వచ్చింది. ఇద్దరు పిల్లలున్నారు. గ్రామంలో బతుకు తెరువులేక మూడేళ్ల కిందట బెంగళూరుకు వలస వచ్చాం. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నెలకు రూ.20 వేల జీతం. భార్య వస్త్రదుకాణ పరిశ్రమ (గార్మెంట్)లోకి వెళ్తోంది.

రామాంజనేయులు, మద్దన్నగారిపల్లి


* ఈ చిత్రంలో తాళంవేసి కనిపిస్తున్నది మద్దన్నగారిపల్లిలోని వెంకటనారాయణకు చెందిన ఇల్లు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం ఇంటర్‌, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పది ఎకరాల భూమి ఉన్నా సేద్యం చేసేందుకు సాగునీరు లేక బీడుగా వదిలేశారు. ఉపాధి కోసం ఈ నెల 4న భార్యభర్తలిద్దరూ బెంగళూరుకి వలస వెళ్లారు. ఇలా గ్రామంలో సుమారు 20కుటుంబాల వరకు బెంగళూరుకి వెళ్లి కార్మికులుగా పనిచేస్తున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

ముదిగుబ్బ పరిధిలోని మద్దన్నగారిపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయం ఆధారంలేక వలసలు వెళ్తున్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ కింద ఉన్న ముదిగుబ్బ గ్రామాలకు నీరు విడుదల చేయాలంటే ప్రత్యేకంగా కాలువ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మైనర్‌ ఇరిగేషన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

కైలాష్‌, ఇరిగేషన్‌ ఏఈ, ధర్మవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని