logo

పనుల్లో జాప్యం.. రైతులకు శాపం

ఈ ప్రాంతం రైతుల జీవనాడి జయమంగళి నది. 32 ఏళ్ల తరవాత గత ఏడాది వరద నీటితో ఉప్పొంగి ప్రవహించింది. కాలువ గట్లు అక్కడక్కడ కోతకు గురయ్యాయి.

Updated : 24 Mar 2023 06:55 IST

షట్టర్ల ముందు దెబ్బతిన్న బెడ్డింగ్‌

పరిగి, న్యూస్‌టుడే: ఈ ప్రాంతం రైతుల జీవనాడి జయమంగళి నది. 32 ఏళ్ల తరవాత గత ఏడాది వరద నీటితో ఉప్పొంగి ప్రవహించింది. కాలువ గట్లు అక్కడక్కడ కోతకు గురయ్యాయి. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కొరిటెగెర తాలూకా దేవరాయన దుర్గ కొండల్లో పుట్టిన నది ఆ రాష్ట్రంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహించి చెర్లోపల్లి వద్ద పరిగి మండలంలోకి ప్రవేశిస్తోంది. వరద నీటిని పరిగి చెరువుకు మళ్లించేందుకు శ్రీరంగరాజుపల్లి సమీపంలో నదికి అడ్డంగా ఏడు షట్టర్‌ గేట్లను ఎన్నో ఏళ్ల కిందట నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. ఆలనాపాలన లేక పోవడంతో రెండు గేట్లు పనిచేయడం లేదు. చెరువుకు వరద ఎక్కువైతే గేట్లు మూసి వేయాలంటే అవస్థ పడాల్సిందే. వరద నీటి ప్రవాహంతో గేట్లకు రెండు వైపులా ఉన్న రాతి, సిమెంట్‌ బెడ్డింగ్‌ కోతకు గురైంది. బెడ్డింగ్‌ రాళ్లు కొట్టుకుపోయాయి. మరో సారి వరద వస్తే గేట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిపైనే పరిగి, రొద్దం మండలాల్లోని చెరువులు ఆధారపడి ఉన్నాయి. వీటి పరిధిలో 3,700 ఎకరాలకు పైబడిన సాగు భూమి ఉంది. ఈ వేసవిలోపు షట్టర్‌ గేట్లతో పాటు, దెబ్బతిన్న రాతి బెడ్డింగ్‌ పనులు సత్వరమే పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు తగుచర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
* ఈ విషయంపై నీటిపారుదలశాఖ ఏఈ లక్ష్మీనారాయణ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ 2019లో జైకా నిధులు రూ.16 కోట్ల వ్యయంతో పీకేపీ ప్రాజెక్టుతో పాటు కుడి, ఎడమ కాలువల పునరుద్ధరణతో పరిగి చెరువుకు నీరందించే కాలువలు, షట్టర్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కరోనా తదితర కారణాలతో పనులు చేపట్టడంలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. రూ.20 లక్షల వ్యయంతో కోతకు గురైన సిమెంట్‌, రాతి బెడ్డింగ్‌ పనులు పూర్తి చేయిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని