logo

హామీలు ఏమయ్యాయి?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Updated : 26 Mar 2023 04:01 IST

193 చెరువులు నింపుతామన్నారు..
నాలుగేళ్లలో ఒక్కటైనా నెరవేర్చని జగన్‌రెడ్డి
50వ రోజు పాదయాత్రలో నారా లోకేశ్‌

ఓడీసీ మండల కేంద్రంలో అభివాదం చేస్తున్న లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, పుట్టపర్తి, ఓబుళదేవరచెరువు, న్యూస్‌టుడే:  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర 50వ రోజు శనివారం ఓడీసీ మండలం ఒనుకువారిపల్లి నుంచి రామయ్యపేట వరకు కొనసాగింది. ఓడీసీలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. 2017లో పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించి హంద్రీనీవా ద్వారా 193 చెరువులకు నీరందిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తలేదన్నారు. రెండేళ్ల కిందట జీవో ఇచ్చి రూ.864 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని గొప్పలు చెప్పారన్నారు. ఇప్పటివరకు ఒక గంప మట్టి తీశారా అంటూ లోకేశ్‌ ప్రశ్నించారు. మారాల రిజర్వాయర్‌ కాలువలు పూర్తిచేసి ఆయకట్టుకు నీరిస్తామని చెప్పిన హామీ తుంగలో తొక్కారన్నారు. పుట్టపర్తిని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని బీరాలు పలికిన జగన్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి చెరువులకు నీరు అందిస్తామన్నారు.  

మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ..

వలసలు నివారిస్తాం..

స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కేరళ వెళ్తున్న వారిలో కొందరు భిక్షాటన చేస్తున్న దుస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితి మారాలంటే నియోజకవర్గంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెదేపా హయాంలోనే కియా లాంటి దిగ్గజ సంస్థను జిల్లాకు తీసుకొచ్చామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఇలాంటి సంస్థలను పుట్టపర్తికి తీసుకొచ్చి..ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను నివారిస్తామన్నారు.  

దుద్దుకుంట కాదు.. దోపిడీకుంట

పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అవినీతిలో దిట్ట అని లోకేశ్‌ ఆరోపించారు. అందుకే దుద్దుకుంట కాకుండా దోపిడీకుంట అని పేరు మార్చినట్లు తెలిపారు. పుట్టపర్తి చుట్టుపక్కల ఎవరూ లేఅవుట్‌ వేసినా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందేనన్నారు. లేఅవుట్‌ ఏర్పాటు చేసుకున్న కొందరు టీచర్ల నుంచి ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే పుట్టపర్తిలో ఒక రోజు ఉంటే హైదరాబాద్‌లో వారం ఉంటారన్నారు. నియోజకవర్గ సమస్యలు గాలికొదిలేసి వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శించారు.

బహిరంగసభలో చేతులెత్తి నినదిస్తున్న జనం

అపూర్వ స్పందన

యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. దారి పొడవునా మహిళలు హారతులిస్తూ నీరాజనాలు పలికారు. వారిని అప్యాయంగా పలకరిస్తూ.. ఫొటోలు దిగుతూ ముందుకుసాగారు. రైతులు, లారీ డ్రైవర్లు, ముస్లింలు, గిరిజనులు, నిరుద్యోగులు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.

నేటి పాదయాత్ర వివరాలు

ఆదివారం ఉదయం 8 గంటలకు రామయ్యపేట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 8.30 రామయ్యపేటలో మహిళలతో సమావేశం, 10.40 గంటలకు అల్లపల్లిలో ఆటోవర్కర్లతో భేటీ, 11.20 గౌనిపల్లిలో ఎస్సీలతో సమావేశం, 12.15 పగడాలవారిపల్లిలో బీసీలతో సమావేశం, 1.15 పగడాలవారిపల్లిలో భోజన విరామం, 2.30 యువతతో ముఖాముఖి, సాయంత్రం 4గంటలకు పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లిలోకి పాదయాత్ర ప్రవేశం... 5గంటలకు గౌనివారిపల్లిలో స్థానికులతో మాటామంతీ, 5.40 కొరెవాండ్లపల్లిలో గ్రామస్థులతో సమావేశం, 6.30 కొండాపురం పంచాయతీ రెడ్డిచెరువుకట్ట వద్ద  బస చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు