logo

నష్టపరిహారానికి నిబంధనలు అడ్డు!

 జిల్లాలో అకాల, వడగళ్ల వానతో పంటలకు ఆపార నష్టం జరిగింది. కళ్లెదుటే చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

Updated : 26 Mar 2023 03:44 IST

33 శాతం పైబడితేనే మంజూరు
ఆందోళనలో బాధిత రైతులు

నేలమట్టమైన మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న డీఏవో చంద్రనాయక్‌, రైతులు

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే :  జిల్లాలో అకాల, వడగళ్ల వానతో పంటలకు ఆపార నష్టం జరిగింది. కళ్లెదుటే చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పంటనష్ట సర్వే మొదలైంది. ఈనెల 30 లోపు పూర్తి చేసేందుకు సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి మూడు రోజుల పాటు రైతుల జాబితా భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యంతరాలుంటే అర్జీలు తీసుకుంటారు. తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా నిబంధనలు అడ్డుగా మారాయి 33 శాతం పైబడి పంటనష్టం జరిగితేనే పరిహారం అందుతుంది. దీంతో చాలా మంది రైతులకు పరిహారం అందే పరిస్థితి లేదని తెలుస్తోంది.

పంటనష్టం రూ.228.95 కోట్లు

జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం, పుట్లూరు, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, పెద్దవడుగూరు, శింగనమల, అనంతపురం గ్రామీణం, గుంతకల్లు, తాడిపత్రి, పామిడి, నార్పల, యల్లనూరు, రాప్తాడు, విడపనకల్లు, పెద్దపప్పూరు, గుత్తి, బొమ్మనహాల్‌, కూడేరు మండలాల్లో వరి, మొక్కజొన్న, అరటి, చీనీ, దానిమ్మ, టమోటా, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. 7,484 హెక్టార్లలో రూ.228.95 కోట్లు పంటనష్టం జరిగిందని వ్యవసాయ, ఉద్యానశాఖలు ప్రాథమిక అంచనా వేశాయి. 7,512 మంది రైతులను గుర్తించారు. ఏయే పంటకు ఎంతెంత నష్టం వాటిల్లిందో.. క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు.

సడలిస్తేనే ప్రయోజనం

పరిహారం మంజూరు చేయటానికి నిబంధనలు విధించారు. ఎంత నష్టం జరిగినా రైతుకు 5 ఎకరాలకే పరిమితం చేశారు. ఈ-పంట నమోదు తప్పనిసరి. 33 శాతంపైబడి నష్టం జరిగితేనే పరిహారం వస్తోంది. లేకపోతే చిల్లిగవ్వ కూడా రాదు. కోతకోసిన తర్వాత, కాలం ముగిసిన పంటలకు ఎటువంటి పరిహారం రాదని ప్రభుత్వం నిబంధన విధించింది. 33 శాతంలోపు నష్టపోయిన రైతులే అధికంగా ఉన్నారు. నిబంధనలు సడలిస్తే రైతుకు మేలు చేకూరుతుందని డివిజన్‌ స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు.


అర్హులందరికీ ఇస్తాం...

చంద్రనాయక్‌, రఘునాథరెడ్డి (వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు)

జిల్లాలోని 19 మండలాల్లో అత్యధికంగా ఉద్యాన, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.  ఈ నెలాఖరు లోపు సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతుల నుంచి అర్జీలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ పరిహారం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని