logo

విద్యార్థి అపహరణ

అపహరణకు గురైన విద్యార్థిని పోలీసులు గంటల వ్యవధిలో గుర్తించారు. నిందితులను అరెస్టు చేశారు.

Published : 26 Mar 2023 03:09 IST

మూడు గంటల్లో గుర్తించిన పోలీసులు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అపహరణకు గురైన విద్యార్థిని పోలీసులు గంటల వ్యవధిలో గుర్తించారు. నిందితులను అరెస్టు చేశారు. అనంత గ్రామీణ పోలీసుల వివరాల మేరకు.. రామగిరి మండలం పోలేపల్లికి చెందిన వెంకటరాముడు కుమారుడు తేజ అనంతపురం రాంనగర్‌ సమీపంలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దగ్గర్లోనే అద్దెగదిలో మిత్రులతో కలిసి ఉంటున్నాడు. శనివారం కక్కలపల్లి వద్ద ఉన్న ఓ కళాశాలలో పరీక్షలు రాయడానికి వెళ్లాడు. అక్కడ రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన రవి, నవీన్‌, నాని, సాయి, రామ్మూర్తి అనే వ్యక్తులు విద్యార్థితో గొడవపడ్డారు. మాటామాట పెరిగి దాడిచేశారు. అనంతరం రెండు ద్విచక్ర వాహనాల్లో తేజను అపహరించుకుని ఎన్‌ఎస్‌ గేట్‌ వైపు తీసుకెళ్లారు. స్థానికులు గమనించి డయల్‌ 100కి సమాచారం ఇచ్చారు. అధికారులు ‘హైఅలర్ట్‌’ యాప్‌ ద్వారా జిల్లా పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. చెన్నేకొత్తపల్లి పోలీసులు ఎన్‌ఎస్‌ గేట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, వారిని చూసిన కిడ్నాపర్లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 8.30కు అపహరణకు గురవగా 11.30 కల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై వెంకటరమణ నిందితులను, బాధితుడిని అనంతపురం తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని