logo

శివరామిరెడ్డి కాలనీలో కన్నీటి కష్టాలు

ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. పట్టణంలోనే పెద్ద కాలనీ అయిన ఇక్కడ 400 వరకు నివాస గృహాలు ఉన్నాయి.

Published : 27 Mar 2023 05:22 IST

కుళాయి వద్ద గుమిగూడిన మహిళలు

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. పట్టణంలోనే పెద్ద కాలనీ అయిన ఇక్కడ 400 వరకు నివాస గృహాలు ఉన్నాయి. 2వేల మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఇరవై ఏళ్ల కిందట ఏర్పడిన ఈ కాలనీ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రస్తుతం నీటి ఎద్దడి నెలకొని జనం అవస్థలు వర్ణనాతీతం. వంక పైభాగాన ఉన్న వీధులకు తాగునీటి సదుపాయం లేదు. అక్కడ వంద వరకు నివాస గృహాలు ఉన్నాయి. మరో మూడు వీధుల్లో ఒకట్రెండు చోట్ల పబ్లిక్‌ కుళాయిలు ఉన్నాయి. వాటికి నాలుగైదు రోజులకోసారి నీరు వస్తున్నాయి. అవి కూడా అరగంటకు మించి రాని పరిస్థితి. నిత్యం కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే స్థానికులు.. నీటిని పట్టుకోవడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి. ఒక్కో కుటుంబానికి ఐదారు బిందెల నీరు దొరకడం గగనంగా మారింది. ఆ నీటినే మూడు నాలుగు రోజులపాటు వాడుకోవాలి. కుళాయిలకు నీరు సరఫరా అయినప్పుడు మహిళల మధ్య ‘కన్నీటి’ యుద్ధమే చోటు చేసుకుంటుంది. మూడేళ్లుగా ఇక్కడ నీటి సమస్య ఉన్నా.. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు మాటలతో సరి పెడుతున్నారు. కాలనీ జనాభాకు తగినట్లుగా పైపులైన్లు నిర్మించడం, కుళాయిలను ఏర్పాటు చేయడం వంటివి చేపట్టడం లేదు. సమస్యను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు లేరు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న వాదన ఉంది. జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి కుళాయిలు ఇస్తున్నామని చెబుతున్నా.. ఇక్కడ అలాంటివేవి కనిపించడం లేదు. నీటి సరఫరా మెరుగుకు పంచాయతీ అధికారులు చొరవ చూపిన దాఖలాలు లేవు. గతంలో పైపులైన్ల నిర్మాణానికి రూ.6లక్షలు కేటాయించినట్లు పంచాయతీలో తీర్మానాలు చేశారు. ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. వేసవి ప్రారంభం కావడంతో కాలనీలో నీటి సమస్య మరింత జఠిలం కానుంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శివరామిరెడ్డి కాలనీలో నీటి సరఫరాను మెరుగు పర్చాలని కాలనీ వాసులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు