logo

ఎండుమిర్చి రైతుకు ధరాఘాతం

అన్నదాతలు ఆరుగాలం చెమటోడ్చి పండించిన ఎండు మిర్చిని అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. స్థానికంగా మార్కెట్‌ వసతి లేకపోవడం.. దళారులు నిర్ణయించిన ధరకు అమ్మలేక సతమతం అవుతున్నారు.

Published : 27 Mar 2023 05:22 IST

కర్ణాటక మార్కెట్లకు దిగుబడుల తరలింపు
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న రైతులు
బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే

గోవిందవాడ వద్ద నిల్వ ఉన్న ఎండు మిర్చి

అన్నదాతలు ఆరుగాలం చెమటోడ్చి పండించిన ఎండు మిర్చిని అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. స్థానికంగా మార్కెట్‌ వసతి లేకపోవడం.. దళారులు నిర్ణయించిన ధరకు అమ్మలేక సతమతం అవుతున్నారు. నాలుగు డబ్బులు మిగులుతాయనే ఆశతో వాహనాల్లో దిగుబడులను కర్ణాటక మార్కెట్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ముగ్గురు రైతులు మిర్చిని కర్ణాటక మార్కెట్‌కు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకొని ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలు రోడ్డున పడిన దయనీయమిది.

జిలాల్లోని రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని బొమ్మనహాళ్‌, కణేకల్లు, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో హెచ్చెల్సీ, హంద్రీనీవా కాలువ కింద రైతులు 10 వేల ఎకరాల్లో ఎండుమిరప సాగు చేస్తున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కోతలు జోరుగా సాగుతున్నాయి. మరో 10 రోజుల్లో లక్ష నుంచి 1.5 లక్షల క్వింటాళ్ల మిరప పంట రైతుల ఇళ్లకు చేరనుంది. విస్తారంగా మిరప పండినా.. ప్రభుత్వం స్థానికంగా మార్కెట్‌ వసతి కల్పించలేదు. ఇక్కడి రైతులు దిగుబడులను అమ్ముకోవాలంటే గుంటూరు, కర్ణాటకలోని బ్యాడిగి, హుబ్బళ్లి, గదగ మార్కెట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి బ్యాడిగి మార్కెట్‌కు 30 కిలోల బస్తాను తరలించేందుకు బాడుగ రూ.120 అవుతుంది.

దళారులే ధర నిర్ణేతలు

రైతుల అమాయకత్వాన్ని దళారులు ఆసరాగా చేసుకుంటున్నారు. స్థానికంగా క్వింటా రూ.23 వేలలోపే ధర నిర్ణయించారు. తేజా రకం క్వింటా రూ.23 వేలు, 273 రకం మిరప క్వింటా రూ.20,500, 5531 రకం క్వింటా రూ.24 వేలు వరకు ధర నిర్ణయించారు. కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్‌లో క్వింటా రూ.29వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతున్నట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయోత్పత్తులను కొంటామని చెప్పడం వాగ్దానాలకే పరిమితమైందని అన్నదాతలు వాపోతున్నారు.


గిట్టుబాటు ధర కల్పించాలి

ప్రభుత్వం ఎండుమిరపకు మద్దుతు ధర నిర్ణయించి ఆదుకోవాలి. పెరుగుతున్న పెట్టుబడులు, కౌలు నేపథ్యంలో స్థానికంగా మార్కెట్‌ ఏర్పాటు చేసి క్వింటా రూ.30 వేలు చొప్పున కొనుగోలు చేయాలి.

రామాంజనేయులు, రైతు, గోవిందవాడ


ప్రభుత్వం ఆదుకోవాలి

ఎండు మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. 1.5 ఎకరాల్లో మిరప సాగు చేయగా రూ.1.60 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. కౌలు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించాలి. ప్రభుత్వం గిట్టుబాటు ధర అందించి అన్నివిధాలా ఆదుకోవాలి.

సోమన్న, మిరప రైతు


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

ఎండు మిర్చి రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన మిరప పంటను పరిశీలించాం. నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.

దస్తగిరి, రాయదుర్గం ఉద్యాన శాఖ అధికారి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు