logo

మెరుగైన వైద్యం.. మాటలకే పరిమితం

మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రుల ఆధునికీకరణకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పనుల పురోగతి అంతంతమాత్రంగానే సాగుతోంది.

Published : 27 Mar 2023 05:22 IST

రెండున్నరేళ్లయినా.. పూర్తికాని  ఆసుపత్రుల భవనాలు
సౌకర్యాల్లేక రోగులకు తప్పని ఇబ్బందులు

అనంత (వైద్యం), న్యూస్‌టుడే: మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రుల ఆధునికీకరణకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పనుల పురోగతి అంతంతమాత్రంగానే సాగుతోంది. పనులు చేపట్టి రెండున్నరేళ్లవుతున్నా.. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాబార్డ్‌, నాడు - నేడు పనుల కింద అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో పలు వైద్యశాలల్లో అదనపు భవనాలు నిర్మించి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. పనులు ఈనెల 31లోపు పూర్తి కావాల్సి ఉన్నా నేటికీ 50 శాతం కూడా పనులు పూర్తి కాలేదు. ఉమ్మడి అనంత జిల్లాలో 14 సీహెచ్‌సీ కేంద్రాలు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక సీడీహెచ్‌ ఉన్నతీకరణ, అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.153.93 కోట్ల నిధులతో 2020 అక్టోబరు 25న టెండర్లు ఆహ్వానించారు. పనులు దక్కించుకున్న గుత్తేదారులు ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాల్లో రూ.58.25 కోట్ల పనులు చేశారు. సత్యసాయి జిల్లాలో 35 శాతం, అనంతపురం జిల్లాలో 48 శాతం పనులు మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన పనులు ఐదు రోజుల గడువులోపు పూర్తి చేయడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు.  దీంతో రోగులు మెరుగైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. ఆలస్యంగా నిర్మాణాలు చేపట్టిన గుత్తేదారులపై చర్యలు తీసుకుంటారా లేదా అనే అంశం తేలాల్సి ఉంది.

కళ్యాణదుర్గం ఆసుపత్రిలో పూర్తికాని పనులు

బిల్లుల చెల్లింపు జాప్యంతో..

సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వైద్యశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోతున్నామని గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పనులు చేపట్టామని, బిల్లులు వచ్చే సమయానికి వడ్డీలు కట్టేందుకే సరిపోయే పరిస్థితి ఉందని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు విడుదల చేయకుండా పనులు పూర్తిచేయాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 2020 నాటి ధరలకు నేటికి ఎంతో వ్యత్యాసముందని, దీంతో అదనపు భారమవుతోందని వాపోతున్నారు. గట్టిగా మాట్లాడితే నిధులు ఇవ్వరేమోనని గుత్తేదారులు విషయాలు బయట మాట్లాడేందుకు జంకుతున్నారు.


సకాలంలో పూర్తి చేయకపోతే తాఖీదులు

- మునిచంద్రారెడ్డి, ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ

సకాలంలో పనులు పూర్తిచేయని గుత్తేదారులకు నోటీసులు ఇస్తాం. వారిచ్చే సంజాయిషీనిబట్టి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకుంటాం. ఆరునెలల కిందట బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగింది. దీంతో భవన నిర్మాణ పనులను గుత్తేదారులు నిలిపివేశారు. ప్రస్తుతం నిధుల విడుదల జరగడంతో అన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. ఇటీవల సత్యసాయి జిల్లాలో రూ.15.06 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.6.35 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ చేశాం. ఈ పనులను పరిగణనలోకి తీసుకుంటే పనుల పురోగతి శాతం పెరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు