logo

పేదలకు మెరుగైన వైద్యం అందించండి

గతంలో వైద్యులంటే దేవుడితో సమానంగా చూసేవారని, ప్రస్తుత సమాజంలో చులకన భావన ఏర్పడిందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, విశ్రాంత ఐఏఎస్‌ జయప్రకాష్‌నారాయణ పేర్కొన్నారు.

Updated : 30 Mar 2023 03:49 IST

సందడిగా అనంత వైద్య కళాశాల స్నాతకోత్సవం

మూడు బంగారు పతకాలు సాధించిన దివిటి తేజశ్వినికి పట్టా అందజేస్తున్న జయప్రకాష్‌ నారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీదేవి తదితరులు

అనంత(వైద్యం), న్యూస్‌టుడే: గతంలో వైద్యులంటే దేవుడితో సమానంగా చూసేవారని, ప్రస్తుత సమాజంలో చులకన భావన ఏర్పడిందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, విశ్రాంత ఐఏఎస్‌ జయప్రకాష్‌నారాయణ పేర్కొన్నారు. వైద్య వృత్తికి పూర్వవైభవం తీసుకువచ్చేలా అందరూ సమన్వయంతో కృషిచేయాలని పిలుపునిచ్చారు. సంపాదించిన డబ్బును చికిత్సల కోసం ఖర్చు పెడుతూ ఏటా దేశంలో ఆరుకోట్లమంది, రాష్ట్రంలో 25 లక్షల మంది పేదలవుతున్నారని తెలిపారు. బుధవారం అనంత వైద్యకళాశాలలో 18వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌నారాయణ, హైదరాబాద్‌ ఇన్‌కమ్‌టాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పేదలకు మానవత్వంతో మెరుగైన సేవలు అందించి మంచి వైద్యులుగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను ఇక్కడే 2016 బ్యాచ్‌లో ఎంబీబీఎస్‌ చదివానని గుర్తు చేశారు. పీజీ చేయకుండా సివిల్స్‌ రాసి ఐఆర్‌ఎస్‌ సాధించినట్లు వివరించారు. 2017లో ఎంబీబీఎస్‌లో చేరి 2023లో కోర్సు పూర్తి చేసుకున్న 93 మంది వైద్యులకు ఈ సందర్భంగా పట్టాలు పంపిణీ చేశారు. ఎంబీబీఎస్‌లో ఉత్తమ మార్కులు సాధించి బంగారు పతకాలకు ఎంపికైన 11 మంది పేర్లను మాత్రమే చదివారు. వీరికి పతకాలను అతిథులు అందజేయలేదు. అంతకముందు అతిథులతో పాటు కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీదేవి, సర్వజన, సూపర్‌ స్పెషాల్టీ వైద్యశాలల సూపరింటెండెంట్లు రఘునందన్‌, సుబ్రహ్మణ్యం, వైస్‌ప్రిన్సిపల్‌ షరోనా సోనియా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు కళాశాల ఆవరణలో కుటుంబసభ్యులు, స్నేహితులతో స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు. ఆలస్యం కావడంతో సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని