logo

తెదేపాతోనే బీసీ సాధికారత

బీసీలకు నిజమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం 1983లో వచ్చిందని, అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎన్టీఆర్‌ 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated : 30 Mar 2023 05:56 IST

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం - న్యూస్‌టుడే, సోమందేపల్లి, పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: బీసీలకు నిజమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం 1983లో వచ్చిందని, అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎన్టీఆర్‌ 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. తర్వాత చంద్రబాబునాయుడు 34 శాతానికి పెంచి రాజకీయ చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. ఎంతో మంది బీసీలను ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులుగా చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. బీసీల సాధికారత తెదేపాతోనే సాధ్యమన్నారు. యువగళం పాదయాత్ర 54వ రోజు సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయునిపల్లి నుంచి పెనుకొండ మండలం హరిపురం వరకు 18.6 కిలోమీటర్లు సాగింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పెనుకొండ సమీపంలోని ఓ కళ్యాణమండపంలో వాల్మీకి బోయ, కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బోయ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు, కురుబ ఫెడరేషన్‌కు రూ.300 కోట్లు కేటాయించి ఖర్చు చేశామన్నారు. బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు 2017లోనే అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. కరుబ సామాజిక భవనాలు నిర్మించడానికి అనంతపురం జిల్లాకు అప్పట్లో రూ.10 కోట్లు కేటాయించామన్నారు. 90 శాతం భవనాలు పూర్తయ్యాయని.. వైకాపా అధికారంలోకి వచ్చాక 10 శాతం కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఉమ్మడి అనంతలో గొర్రెలు కొనేందుకు రూ.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 50 శాతం రాయితీతో రూ.4 లక్షల మేర రుణాలు మంజూరు చేశామన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో ఛైర్మన్లు కూర్చోవడానికి కుర్చీలు లేవన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ బలోపేతం చేస్తాం

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ఎసీలకు మాత్రమే కేటాయించిన రూ.28 వేల కోట్లను ఇతర పథకాలకు మళ్లించారని లోకేశ్‌ ఆరోపించారు. జగనన్న కాలనీలో సెంటు స్థలం పేరుతో రూ.7 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సోమందేపల్లిలోని ఎసీˆ్స కాలనీవాసులు లోకేశ్‌ను కలిసి సమస్యపై విన్నవించారు. స్థానికంగా చాలామందికి ఇళ్ల స్థలాలు కేటాయించలేదని వారు వాపోయారు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని మూలనపడేశారని.. బిందె రూ.10తో కొనుగోలు చేస్తున్నామని వాపోయారు. లోకేశ్‌ స్పందిస్తూ నీటిశుద్ధి ప్లాంటును పునరుద్ధరించి.. ఇళ్లు లేని వారికి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

సోమందేపల్లిలో వినతిపత్రం ఇస్తున్న చేనేత కార్మికులు

వ్యవసాయాన్ని విస్మరించిన ప్రభుత్వం

జగన్‌ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల్ని చిన్నచూపు చూస్తోందని లోకేశ్‌ విమర్శించారు. తెదేపా హయాంలో ఉమ్మడి జిల్లాలో సుమారు లక్ష మంది రైతులకు డ్రిప్‌ పరికరాలు 90 శాతం రాయితీతో అందించామన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిలిపివేసిందన్నారు. గతంలో పట్టు రైతులకు డ్రిప్‌, షెడ్లు, మొక్కలపై రాయితీ ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా పట్టు రైతుల సంఘం ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి సమస్యల పరిష్కారంపై వినతిపత్రం అందించారు. లోకేశ్‌ స్పందిస్తూ తెదేపా అధికారంలోకి రాగానే పట్టు రైతులకు రాయితీ పునరుద్ధరిస్తామన్నారు.

నేటి పర్యటన వివరాలు

పెనుకొండ మండలం హరిపురం సమీపంలోని విడిది కేంద్రం నుంచి గురువారం ఉదయం 8 గంటలకు నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం. 8.15 గంటలకు హరిపురం గ్రామస్థులతో మాటామంతీ. 9.35కు ఎర్రమంచి వద్ద కియా కార్ల పరిశ్రమల ఉద్యోగులతో ముఖాముఖి. 10.30కు అమ్మవారిపల్లిలో స్థానికులతో భేటీ. 11.10 గంటలకు యువగళం పాదయాత్ర 700 కిలో మీటర్లకు చేరిక. 11.20కు గుట్టూరులో 700 కిలో మీటర్లకు చేరిన పాదయాత్రకు గుర్తుగా శిలాఫలకం ఆవిష్కరణ. 12 గంటలకు గుట్టూరులో రహదారి పక్కన వక్కలిగ సామాజిక వర్గీయులతో ముఖాముఖి. ఒంటి గంటకు అక్కడే భోజన విరామం. 2 గంటలకు తిరిగి పాదయాత్ర కొనసాగింపు. 3.30కు యువగళం పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలోకి ప్రవేశం. 3.45 చెన్నేకొత్తపల్లి సమీపంలో స్థానికులతో మాటామంతీ. 4.20కు కోన రోడ్డులో స్థానికులతో ముఖాముఖి. 4.35 గంటలకు కోన మలుపు వద్ద విడిది కేంద్రానికి చేరిక, రాత్రి బస.

సైకిల్‌ గుర్తు ముద్రించిన శాలువాతో సన్మానిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని