logo

క్రైమ్ న్యూస్

అనంతపురం నగర శివారు కక్కలపల్లి పంచాయతీలోని సీపీఎం కాలనీకి సమీపంలోని ఓ టమోటా మండీలో బిల్లే శ్రీనివాసులు (42) అనేవ్యక్తి మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.

Published : 30 Mar 2023 03:44 IST

వ్యాపారి దారుణ హత్య
వ్యక్తిగత కక్షలే కారణమా?

బిల్లే శ్రీనివాసులు (పాత చిత్రం)

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగర శివారు కక్కలపల్లి పంచాయతీలోని సీపీఎం కాలనీకి సమీపంలోని ఓ టమోటా మండీలో బిల్లే శ్రీనివాసులు (42) అనేవ్యక్తి మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. ఆత్మకూరుకు చెందిన శ్రీనివాసులు కొన్నేళ్ల కిందట అనంతపురం వలస వచ్చారు. సీపీఎం కాలనీలో ఉంటూ గొర్రెల వ్యాపారం, చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. గతేడాది టమోటా మండీ టోల్‌ వసూలు టెండరును దక్కించుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో స్కూటీలో ఇంటికి వెళ్తుండగా జేకేఆర్‌ టమోటా మండీ వద్ద కొందరు యువకులు మద్యం తాగి గొడవపడుతుండగా శ్రీనివాసులు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. వంశీ అనేవ్యక్తిని దండించారు. గొడవ సద్దుమణిగి ఘటనాస్థలి నుంచి అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే శ్రీనివాసులు, మరోవ్యక్తితో కలిసి మండీలో మద్యం తాగుతూ కూర్చుండగా వంశీ, తన మిత్రులు మునీంద్ర, సుబ్రహ్మణ్యంతో కలిసి మారణాయుధాలతో వచ్చి గొడవకు దిగినట్లు తెలిసింది. శ్రీనివాసులుపై కొడవలితో విచక్షణా రహితంగా దాడి చేసినట్లు సమాచారం. అతనితో పాటు ఉన్నవ్యక్తి భయంతో పరుగులు తీశాడు. తెల్లవారుజామున అటుగా వస్తున్న స్థానికులు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి అనంతపురం ఇన్‌ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ విజయభాస్కర్‌గౌడ్‌, ఎస్సై నబీరసూల్‌, సిబ్బంది చేరుకుని ఆరా తీశారు. అలాగే క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.

పోలీసుల అదుపులో నిందితులు?: హత్య చేసిన దుండగులు ద్విచక్ర వాహనంలో ఆత్మకూరు మీదుగా కళ్యాణదుర్గం వైపు వెళ్టినట్లు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హత్యలో పాల్గొన్న ముగ్గురితోపాటు మరో ఐదుగురిని విచారిస్తున్నట్లు సమాచారం. వ్యక్తిగత కక్షలే కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడికి నివాళులు అర్పించారు.


అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

రామాంజనేయులు (పాతచిత్రం)

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణ వివరాల మేరకు.. కర్ణాటకలోని హొసపేటె తాలుకా సుగినహళ్లి వద్ద ఉన్న శ్రీరామ రంగాపురానికి చెందిన రామాంజనేయులు(39) కొన్నేళ్లుగా అనంతపురంలోని హౌసింగుబోర్డు కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కూడేరు మండలం కడదరకుంట వద్ద 11 ఎకరాల దానిమ్మ తోటను కౌలు పద్ధతిలో నాలుగేళ్లుగా సాగు చేస్తున్నాడు. పంటకు తెగుళ్లు అధికం కావడంతో మూడేళ్లుగా నష్టపోతున్నారు. దీంతో రూ.22లక్షల వరకు అప్పులు అయ్యాయి. ఈ ఏడాది కూడా పంట దిగుబడి అంతంత మాత్రంగానే ఉండగా అప్పులు చెల్లించాలన్న ఒత్తిడి అధికమైంది. చేసేది లేక బుధవారం పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పక్క పొలాల వారు గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య ద్రాక్షయిని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.


ఆజాద్‌నగర్‌లో మహిళ..

అనంత నేరవార్తలు: నగరంలోని ఆజాద్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. ఆజాద్‌నగర్‌కు చెందిన ఇస్మాయిల్‌, సర్దార్‌బీ (57) భార్యాభర్తలు. వీరు కుమారుడు కోడలుతో కలిసి జీవిస్తున్నారు. రాత్రి సర్దార్‌బీ కుమారుడు రాత్రి విధులు నిమిత్తం కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. భర్త వారు నిర్వహిస్తున్న దుకాణం వద్ద పడుకున్నారు. ఇంట్లో అత్తా కోడళ్లు వేర్వేరు గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. బయట గదిలో నిద్రించిన సర్దార్‌బీని గుర్తు తెలియని వ్యక్తులు మెడకు విద్యుత్తు తీగలు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తెల్లవారుజామున గమనించిన మృతురాలి భర్త ఇస్మాయిల్‌ నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఘటనాస్థలికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కోడలు సుల్తానా తన భార్యతో తరచూ గొడవపడేదని, ఆమెనే ఇతరులతో కలిసి హత్య చేసి ఉంటుందని ఇస్మాయిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


కలతచెంది కార్మికుడు..

ధర్మవరం, న్యూస్‌టుడే : ధర్మవరం సాయినగర్‌కు చెందిన నాగరాజు (35) అనే టింబర్‌ డిపో కార్మికుడు అప్పుల బాధతో బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు అతడిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి నాగరాజు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తండ్రి నారప్ప వైద్యం కోసం రూ.2 లక్షల వరకు నాగరాజు అప్పు చేశాడు. అప్పు విషయంలో కుటుంబసభ్యులతో మాటామాట పెరగడంతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. కేసు నమోదు చేశారు.


యువతి బలవన్మరణం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మీ(22) బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులతో కలిసి అనంతపురంలో నివాసం ఉంటుంది. ఇక్కడే ఓ సంస్థలో సేల్స్‌గర్ల్‌గా పని చేసేది. వేతనం కళ్యాణదుర్గంలోని ఓ బ్యాంకులో జమ అవుతుంది. ఆ డబ్బు తీసుకొనేందుకు వచ్చి, స్వగ్రామానికి వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు విషయాన్ని గ్రామంలోని బంధువుకు ఫోన్‌ద్వారా చెప్పారు. వారు వెళ్లి చూడగా ఇంటికి తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే ఆమె ఉరి వేసుకుంది. విషయాన్ని తల్లిదండ్రులకు, పోలీసులకు తెలిపారు. పట్టణ ఎస్‌ఐ ఆశాబేగం సిబ్బందితో గ్రామానికి వెళ్లి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు.


జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం

కదిరి పట్టణం: అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన జిలెటిన్‌ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కదిరి - రాయచోటి రోడ్డులోని కుమ్మరవాండ్లపల్లి వద్ద రోడ్డు పక్కన ఉన్న పెట్టెలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పరిశీలించగా ప్యాకింగ్‌పై తమిళనాడు కంపెనీ చిరునామా ఉందని పోలీసులు తెలిపారు.


సింగిల్‌ విండో అధ్యక్షుడి హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

గుత్తి,న్యూస్‌టుడే: పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సింగిల్‌ విండో అధ్యక్షుడు భాస్కరరెడ్డి హత్యకేసులో ఇద్దరు నిందితులకు గుత్తి ఆరో అదనపు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదును విధించింది. వీరితోపాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్షను బుధవారం ఖరారు చేసింది. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. అప్పేచర్లకు చెందిన భాస్కరరెడ్డి, గురుప్రసాద్‌ వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు నెలకొంది. వైకాపాకు చెందిన భాస్కరరెడ్డి క్రిష్టిపాడు సింగిల్‌విండోకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను జీర్ణించుకోలేని గురుప్రసాద్‌ వర్గానికి చెందిన వారు అతడు రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన వారి మాటను లెక్కచేయకుండా అధ్యక్షుడిగానే కొనసాగుతూ వస్తుండటంతో గురుప్రసాద్‌ వర్గీయులు పథకం ప్రకారం 2015 మార్చి 31న క్రిష్టిపాడులోని విండో కార్యాలయానికి వెళ్లి భాస్కరరెడ్డిని కర్రలతో దాడిచేసి హత్యచేశారు. ఈ సంఘటనపై పెద్దవడుగూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన గుత్తి ఏడీజే కబర్దీ నిందితులు గురుప్రసాద్‌, శ్రీనివాసులుకు జీవిత ఖైదు విధించారు. సుధాకర్‌నాయుడు, చలపతినాయుడుతోపాటు మరో నిందితుడికి ఆరునెలల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. జి.రమణ, వెంకటరమణకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధస్తూ తీర్పును వెలువరించారు. కేసును ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ బూసా సుధీర్‌రెడ్డి వాదించారు. తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద గుత్తి, పామిడి, పెద్దవడుగూరు, యాడికి పోలీసులు బందోబస్తును నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని