logo

వరదొస్తే మళ్లీ యాతనే!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వరదతో చాలాప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. పలు గ్రామీణ రోడ్లు రూపు కోల్పోయాయి. వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోయాయి.

Updated : 01 Jun 2023 05:16 IST

ఉమ్మడి జిల్లాలో దారుణంగా రహదారులు
తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టిన వైనం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం - న్యూస్‌టుడే బృందం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వరదతో చాలాప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. పలు గ్రామీణ రోడ్లు రూపు కోల్పోయాయి. వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల భారీ గుంతలు పడి ప్రయాణం నరకప్రాయంగా మారింది. పలుచోట్ల తారు కొట్టుకుపోయి మట్టి దారుల్లా దర్శనమిస్తున్నాయి. గతేడాది దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతు చేసి అధికారులు చేతులు దులుపేసుకున్నారు. కొన్నిచోట్ల ఎర్రమట్టి పోసి మమ అనిపించారు. కల్వర్టుల స్థానంలో ఇసుక బస్తాలు పేర్చి రాకపోకలు పునరుద్ధరించారు. భారీ వర్షాలు కురిస్తే వరదకు తాత్కాలిక మరమ్మతులు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. రాకపోకలకు సాగించాలంటే గగనంగా మారుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుస్థితి నెలకొన్నా ప్రభుత్వం తగిన రీతిలో స్పందించడం లేదు.

నిధుల ఊసేదీ?

ఏటా రోడ్ల నిర్వహణకుగాను కిలోమీటరుకు రూ.20 వేలు చొప్పున గ్రాంటు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది విడుదల కాలేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రహదారులపై ప్రజలు విన్నవిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రోడ్లు నిర్మాణంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు మధ్యలోనే నిలిపివేశారు. చాలా చోట్ల కంకర వేసి వదిలేశారు. గతేడాది మరమ్మతులకు రూ.50 కోట్లు మంజూరు అయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో రూ.55 కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొంటున్నారు. 


గుంతకల్లు వెళ్లాలంటే గగనమే

బొమ్మనహాళ్‌ మండలం కల్లుదేవనహళ్లి వద్ద గతేడాది వేదవతి ఉద్ధృతికి రహదారి కొట్టుకుపోయింది.  మరమ్మతులకు రూ.1.20 కోట్లు మంజూరైనా తాత్కాలిక రోడ్డు నిర్మించి అధికారులు చేతులు దులుపేసుకున్నారు. బొమ్మనహాళ్‌ నుంచి గోవిందవాడ, దర్గాహోన్నూరు, పాల్తూరుతోపాటు విడపనకల్లు, ఉరవకొండ మీదుగా గుంతకల్లు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. ఈ రోడ్డు కొట్టుకుపోయినప్పుడు సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాత్కాలిక మరమ్మతులు చేయడంతో మళ్లీ వరద వస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.  


బస్సులు నిలిపేశారు

పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు నుంచి కొండుపల్లి, భీమునిపల్లి, రావులుడికి వెళ్లే  మార్గం గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఒకప్పుడు గుత్తి డిపో నుంచి క్రిష్టిపాడు మీదుగా ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడిపేవారు. రహదారులు అధ్వానంగా మారడంతో బస్సు సర్వీసులు రద్దు చేశారు. దీంతో ఇక్కడి ప్రజలు అత్యవసర పరిస్థితులతోపాటు,  ఇతర పనులకు పట్టణాలకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు.


గుట్టను చదును చేసినా..

ముదిగుబ్బ మండలం గుట్టకిందపల్లి వెళ్లేందుకు మట్టి రోడ్డే దిక్కుగా మారింది. మల్లేపల్లి నుంచి అప్రోచ్‌ రోడ్డు నిర్మించడానికి గతంలో గుట్టను చదును చేశారు. రహదారి నిర్మించకుండా వదిలేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి తాగునీరు సరఫరా చేసే ట్యాంకర్లు రావడానికి వీలు లేకుండా పోయింది. దీంతో దిచక్రవాహనాల్లో తాగునీరు తెచ్చుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు.


మూడు కిలోమీటర్లు..అరగంటకు పైగా ప్రయాణం

గాండ్లపెంట మండలం కటారుపల్లి క్రాస్‌ నుంచి బూరుగుపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలకు వెళ్లే  రహదారి గుంతలమయమైంది. గుంతల కారణంగా మూడు కిలోమీటర్లు ప్రయాణించడానికి అరగంట పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. నిత్యం ప్రయాణం చేసే బూరుగుపల్లి, అబ్బావాండ్లపల్లి, కనుమలోల్లపల్లి, ఆర్షాన్‌పల్లి గ్రామాల ప్రజలు నరకయాతన పడుతున్నారు.


సీఎంకు చెప్పినా..

తాడిమర్రి మండలం మాల్యవంతం నుంచి పార్నపల్లి వరకు రహదారి గోతులమయంగా మారింది. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. నాలుగేళ్లలో మరమ్మతులకు రూ.3 కోట్లు ఖర్చు చేసినా రోడ్డు బాగుపడలేదు. ఏటా గోతుల పూడ్చటం.. వర్షాలకు మళ్లీ కొట్టుకుపోవడం జరుగుతోంది. నాసిరకం పనుల కారణంగా ప్రజాధనం వృథా అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది డిసెంబరు 7న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనంత పర్యటనకు వచ్చిన సందర్భంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి... రహదారి పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు. దాడితోటకు వెళ్లే దారి తారు కొట్టుకుపోయి మట్టి రోడ్డును తలపిస్తోంది. రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపగా అనుమతి రాలేదని అధికారులు చెబుతున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని