logo

నెట్టికంటి ఉత్సవాలకు అవరోధాలు తొలగేనా?

ముందుచూపు లేకుండా గతంలో నిర్మించిన దుకాణాలు ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులకే కాకుండా ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలకు అవరోధంగా మారాయి.

Published : 01 Jun 2023 04:24 IST

షెడ్ల ఏర్పాటుకు నిర్మించిన పునాదులు

గుంతకల్లు, న్యూస్‌టుడే: ముందుచూపు లేకుండా గతంలో నిర్మించిన దుకాణాలు ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులకే కాకుండా ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలకు అవరోధంగా మారాయి. కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద దుకాణాలు ప్రస్తుతం ఆటంకంగా మారాయి. వాటిని తొలగించి ఆలయానికి దూరంగా నిర్మించే పనులు కార్యరూపం దాల్చలేదు. ఆలయానికి ఆనుకుని ఉన్న మూడు రోడ్ల పక్కన గతంలో 25కు పైగా వాణిజ్య గదులు నిర్మించారు. రోజురోజుకు ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో వారు ఆలయం ముందు రాత్రి సమయాల్లో నిద్రచేయడానికి ఇపుడున్న స్థలం చాలక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, పల్లకి ఉత్సవాలు నిర్వహించడానికి, తేరు, భక్తులు వెళ్లడానికి రోడ్లు ఇరుకుగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

టెండరు రద్దు చేసి వదిలేశారు

ప్రస్తుతం ఆలయం ముందున్న వాణిజ్యపు సముదాయాన్ని తొలగించి ఆలయానికి చెందిన ప్రధాన రహదారి పక్కన నిర్మించదలచిన అధికారులు నాలుగు సంవత్సరాల కిందట రూ.1.5 కోట్లను కేటాయించి టెండరును నిర్వహించారు. గదులను నిర్మించడానికి రోడ్డుకు ఆనుకుని ఉన్న గుట్టను చదునుచేసే పనులను చేపట్టారు. గుట్టను తొలగించే పనులకు ఉన్నతాధికారులు అభ్యంతరం తెలిపారు. గుట్టను తొలగించడం మంచిది కాదని, గదులను వేరే ప్రదేశంలో నిర్మించాలని సూచించారు. గదులను తొలగించిన తరువాత కొత్త గదులను నిర్మించేవరకు వ్యాపారాలు చేసుకోవడానికి యాత్రికుల వసతి గదుల సముదాయపు ప్రాంగణం చివరలో షెడ్లను నిర్మించడానికి అవసరమైన పునాదులను కూడా అప్పట్లోనే నిర్మించారు. ఇప్పటివరకు కొత్త గదుల నిర్మాణం జరగలేదు. తాత్కాలిక షెడ్ల ఏర్పాటుకు నిర్మించిన పునాదులు పాడైపోతున్నాయి. ఇప్పటికీ ఆలయానికి ఆనుకుని ఉన్న గదులను తొలగించడం, కొత్త గదులను నిర్మించే పనులు చేపట్టక పోవటంతో ఆలయానికి వచ్చే భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆలయం ముందున్న గదులను తొలగించి రాత్రి సమయంలో ఆలయం ముందు నిద్రచేసే సౌకర్యాన్ని కల్పించాలని, ఉత్సవాల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.


దూరంగా నిర్మిస్తాం

ఇప్పుడున్న దుకాణాలను తొలగించి వాటిని ఆలయానికి దూరంగా నిర్మించాలని నిర్ణయించాం. గుట్టను తొలగించడానికి ఉన్నతాధికారులు అంగీకరించలేదు. దీంతో గదుల నిర్మాణం కోసం నిర్వహించిన టెండరును రద్దుచేయాల్సి వచ్చింది. మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపర్చిన ప్రదేశంలో షాపింగ్‌ గదులను నిర్మిస్తాం. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన సౌకర్యాలను కల్పిస్తాం.

ధనుంజయ, సహాయ కార్యనిర్వహణాధికారి


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు