logo

జ్యూస్‌ ఇచ్చి.. చోరీ చేస్తాడు

ఒంటరి మహిళలను పరిచయం చేసుకుని నిద్రమాత్రలు కలిపిన జ్యూస్‌ ఇచ్చి స్పృహ తప్పితే వారి వద్ద విలువైన ఆభరణాలు దొంగలిస్తున్న చోరుడిని అనంతపురం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు.

Published : 01 Jun 2023 04:24 IST

ఒంటరి మహిళలే లక్ష్యం
నిందితుడి పట్టివేత

కేసు వివరాలు వెల్లడిస్తున్న రూరల్‌ డీఎస్పీ వెంకటశివారెడ్డి, పక్కన సీఐ విజయభాస్కర్‌ గౌడ్‌

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఒంటరి మహిళలను పరిచయం చేసుకుని నిద్రమాత్రలు కలిపిన జ్యూస్‌ ఇచ్చి స్పృహ తప్పితే వారి వద్ద విలువైన ఆభరణాలు దొంగలిస్తున్న చోరుడిని అనంతపురం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.6.40 లక్షలు విలువ చేసే 124.8 గ్రాముల బంగారు నగలు, రెండు చరవాణులు, నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రూరల్‌ డీఎస్పీ వెంకటశివారెడ్డి సోమవారం రూరల్‌ స్టేషన్‌ ఆవరణలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోట మండలం శ్యామచంద్రాపురం గ్రామానికి చెందిన చేవూరి చంద్ర అలియాస్‌ చంద్రబాబు పదహారేళ్లకే వ్యసనాలకు అలవాటుపడ్డాడు. వంటపని చేస్తుండేవాడు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని చోరీల బాట పట్టాడు.

మత్తులోకి దింపి..

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలను ప్రారంభించాడు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ఒంటరిగా ఉన్న మహిళలతో మంచి మాటలతో పరిచయం చేసుకుంటాడు. వారితో డబ్బున్న వ్యక్తిలా నమ్మిస్తాడు. వారి మనస్తత్వాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మాటలు చెబుతాడు. వారికి మరింత దగ్గరై ఫోన్‌ నెంబర్లు, చిరునామా సేకరిస్తాడు. కొన్నిరోజులపాటు వారితో ఫోన్‌లో సంభాషిస్తాడు. అతి వినయం, మంచితనం ప్రదర్శిస్తాడు. అవతలివారు ఇంటికి ఆహ్వానించే విధంగా ప్రవర్తిస్తాడు. అలా  ఆహ్వానించిన వారి ఇంటికి వెళ్లేటప్పుడే ఓ సీసాలో నిద్రమాత్రలు కలిపిన జ్యూస్‌ను తీసుకెళ్తాడు.  ఆరోగ్యానికి మంచిదని తాగేలా చేస్తాడు. స్పృహతప్పి పడిపోగానే ఒంటి మీద, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తాడు. తాడిపత్రి, ముషీరాబాద్‌లో ఈ తరహా చోరీలు చేశాడు. నంద్యాల, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు.

పట్టుబడిందిలా..

గత నెలలో అనంతపురం నగరానికి చెందిన ఓ మహిళ కదిరి నుంచి బస్సులో వస్తుండగా అదే బస్సులో నిందితుడు ప్రయాణిస్తూ పరిచయం పెంచుకున్నాడు. నిందితుడి మాయమాటలు నమ్మిన మహిళ చిరునామా, ఫోన్‌ నెంబర్లు ఇచ్చి ఇంటికి ఆహ్వానించింది. ఆమెతో జ్యూస్‌ తాగించాడు. స్పృహతప్పి పడిపోయాక మెడలో, బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. బాధితురాలు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ విజయభాస్కర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఎస్సై నబీరసూల్‌, సిబ్బంది శివన్న, జయరాం, పాండవలు బృందంగా ఏర్పడి మంగళవారం రాత్రి అనంతపురం ఆర్టీసీ బస్టాండులో నిందితుడిని అరెస్టు చేశారు. జిల్లా కోర్టు రిమాండు విధించింది. అంతర్రాష్ట్ర నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని