logo

చిరుద్యోగుల నియామకం ఉత్తర్వులేనా?

సాంఘిక సంక్షేమశాఖలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకే దిక్కులేదు[. నెలలు గడుస్తున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఓవైపు నియామక ఉత్తర్వులు ఇవ్వరు.. మరోవైపు గతంలో పనిచేసిన సమయానికి వేతనాలు ఇవ్వకపోగా తాజాగా పనిచేసిన వారికీ వేతనాలు ఇవ్వలేదు.

Published : 02 Jun 2023 05:09 IST

సాంఘిక సంక్షేమశాఖలో వింత విధానం

సాంఘిక సంక్షేమ భవనం

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమశాఖలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకే దిక్కులేదు[. నెలలు గడుస్తున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఓవైపు నియామక ఉత్తర్వులు ఇవ్వరు.. మరోవైపు గతంలో పనిచేసిన సమయానికి వేతనాలు ఇవ్వకపోగా తాజాగా పనిచేసిన వారికీ వేతనాలు ఇవ్వలేదు. విద్యార్థుల ఆకలి తీర్చే ఉద్యోగులకు కడుపులు కాలుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని కళాశాల వసతి గృహాల్లో పనిచేస్తున్న వంట మనుషులు, కమాఠీలు ఇప్పటికే విధులు నిర్వహిస్తుంటే వారందర్నీ నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పుడు నియామకాలు చేస్తారో, వేతనాలు ఇస్తారో ఇవ్వరో అన్న ఆందోళన చిరుద్యోగుల్లో నెలకొంది.

నాలుగు నెలలవుతున్నా..

రాష్ట్రంలోని ఏడు పాత జిల్లాలను పరిగణనలోకి తీసుకొని అప్పటికే ప్రీమెట్రిక్‌ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తుంటే వారి సర్వీసును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతపురం జిల్లాలోని 24 కళాశాలల వసతి గృహాల్లో 41 మందిని ఎంపిక చేసి వారిని ఆప్కోస్‌లోకి అనుసంధానం చేయాలని ఉత్తర్వులిచ్చారు. గతంలో వారికి సక్రమంగా వేతనం అందకపోవడానికి చింతిస్తున్నామని, వెంటనే వారిని ఆప్కోస్‌లోకి తీసుకుంటే నెలనెలా వేతనాలు సక్రమంగా అందుతాయని 2023, ఫిబ్రవరి 24న ప్రభుత్వ ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే నాలుగు నెలలవుతున్నా అదిగో ఇదిగో అంటున్నారే గానీ.. అమలు చేయలేదు. ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకే విలువ లేకపోవడం ఏమిటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి వద్దే ఆగిన దస్త్రం

ఉద్యోగ నియామకాలకు సంబంధించిన దస్త్రం ఇప్పటికే సాంఘిక సంక్షేమ అధికారులు సిద్ధం చేశారు. సంబంధిత దస్త్రం కలెక్టరు ఆమోదించి అనంతరం ఇన్‌ఛార్జి మంత్రికి పంపినట్లు సమాచారం. ఇన్‌ఛార్జి మంత్రి నుంచి ఆమోదం పొంది రావాల్సి ఉండగా ఇంకా రాలేదు. నెలలు గడుస్తున్నా సమస్య మాత్రం తీరడం లేదు. ఈ ఆఫీసులో పరిశీలించి దస్త్రం ఆమోదించాల్సి ఉంది.

సంవత్సరాలుగా అందని వేతనం

జీతం లేకున్నా ఎప్పుడైనా వస్తుందంటూ సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 28 నెలలుగా పని చేసినట్లు అధికారులు లెక్కలు తీశారు. గతంలో ఒక్కొక్కరికి రూ.10 వేలు అందజేసేవారు. మొత్తం రూ.1.20 కోట్ల వేతనం అందివ్వాల్సి ఉంది. ఆప్‌కాస్ట్‌లోకి చేర్చుకుంటున్నట్లు నాలుగునెలల కిందట ఉత్తర్వులు రావడంతో ఆనందించారు. ఇప్పటి దాకా వేతనం ఇవ్వకపోగా నియామకపు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఎవరికి చెప్పాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.

వెంటనే నియమించాలి..

కళాశాల వసతి గృహాల్లో 41 మందికి ఇప్పటి వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలి. జీతాలకు వచ్చిన బడ్జెట్‌ కూడా వెనక్కి వెళ్లింది. వెంటనే ఆప్కోస్‌లోకి కలిపి వేతనాలు ఇవ్వాలి.

ఎమ్‌.తిప్పయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

త్వరలోనే నియామకాలు

41 మందిని ఎంపిక చేశాం. వారందరి వివరాలు క్రోడీకరించాం. సంబంధిత దస్త్రం కలెక్టరుకు నివేదించాం. త్వరలోనే వారికి నియామకపు ఉత్తర్వులు ఇస్తాం. గతంలో ఇవ్వాల్సిన వేతనానికి సంబంధించి వివరాలు సిద్ధం చేశాం.

విశ్వమోహన్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని