logo

జోరుగా బేరాలు.. స్థలాల అమ్మకాలు!

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ధర్మవరం పట్టణానికి చెందిన ఆరు వేల మందికి ఒకటిన్నర సెంటు ప్రకారం పట్టణ సమీపాన ఉన్న పోతులనాగేపల్లి వద్ద స్థలాలు ఇచ్చారు. ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉన్నాయి.

Published : 02 Jun 2023 05:09 IST

రూ.30 కోట్ల విలువైనవి చేతులు మారిన తీరు
పోతులనాగేపల్లి జగనన్న కాలనీలో పరిస్థితి

ప్రధాన రహదారి పక్కన జగనన్న కాలనీ

న్యూస్‌టుడే, ధర్మవరం: ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ధర్మవరం పట్టణానికి చెందిన ఆరు వేల మందికి ఒకటిన్నర సెంటు ప్రకారం పట్టణ సమీపాన ఉన్న పోతులనాగేపల్లి వద్ద స్థలాలు ఇచ్చారు. ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉన్నాయి. ధర్మవరం నుంచి పుట్టపర్తి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రధాన రహదారికి సమీపాన ఒకటిన్నర సెంటు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు అమ్ముతున్నారు. కాస్త లోపలికి వెళితే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు చెబుతున్నారు. స్థలం పొందినవారు కొనుగోలుదారుకు అగ్రిమెంట్లు రాయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇంటి బిల్లులు దక్కేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఇందులో అధికార పార్టీ నాయకులదే కీలకపాత్ర. దళారుల ద్వారా కమీషన్‌ తీసుకుంటూ క్రయవిక్రయాలు చేస్తున్నారు. స్థలం అమ్మించినందుకు రూ.50 వేల వరకు కమీషన్‌ తీసుకుంటున్నారు. పోతులనాగేపల్లి జగనన్న కాలనీలో 6089 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీరందరూ ధర్మవరం పట్టణానికి చెందినవారే. 4500 మంది నిర్మాణాలు చేపట్టారు. మరో 1500 మంది ఇంతవరకు ప్రారంభించలేదు.

వెయ్యికిపైగా విక్రయం

కాలనీలో ఏడాదిగా జోరుగా బేరాలు...క్రయవిక్రయాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఇళ్ల పట్టాల క్రయవిక్రయాలకు అవకాశం లేదు.రిజిస్ట్రేషన్‌ కావు. కొందరు వైకాపా నాయకులు మధ్యవర్తులను పెట్టుకుని ఒప్పంద విధానంలో క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికే 1000 పట్టాల వరకు అమ్మినట్లు తెలుస్తోంది. సుమారు రూ.30 కోట్ల మేర చేతులు మారాయి. ఇంత జరుగుతున్నా విక్రయాలకు సంబంధించి సరైన ఆధారాలు లభించడం లేదంటూ అధికార యంత్రాంగం మిన్నకుండిపోతోంది. అధికార పార్టీ అండతోనే దందా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రద్దు చేస్తాం... 

ఇళ్ల స్థలాలను అమ్ముకుంటే పట్టా రద్దు చేస్తాం. లబ్ధిదారుల నుంచి ఎవరూ కొనవద్దు. విచారణ తేలితే కొనుగోలుదారులు  నష్టపోతారు. దళారులపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

తిప్పేనాయక్‌, ఆర్డీవో, ధర్మవరం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని