అనుకూలురకే పెద్దపీట!
తహసీల్దార్ల బదిలీల్లో అధికార వైకాపా రాజకీయ సిఫార్సులకే పెద్దపీట వేసినట్లు స్పష్టమైంది. తమకు అనుకూలంగా ఉన్న వారిని కదిలించలేదు. చెప్పిన మాట వినని వారిపై బదిలీ వేటు వేయించారు.
తహసీల్దార్ల బదిలీల్లో రాజకీయం
14 మందికి స్థానచలనం
జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: తహసీల్దార్ల బదిలీల్లో అధికార వైకాపా రాజకీయ సిఫార్సులకే పెద్దపీట వేసినట్లు స్పష్టమైంది. తమకు అనుకూలంగా ఉన్న వారిని కదిలించలేదు. చెప్పిన మాట వినని వారిపై బదిలీ వేటు వేయించారు. చాలా మంది తహసీల్దార్లు సంవత్సరం కూడా పని చేయకుండానే స్థానచలనం కల్గించారు. దీన్ని బట్టి అనుకూలురకే పెద్దపీట వేసినట్లు తేటతెల్లమవుతోంది. ఒకే చోట ఐదేళ్లు పని చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. లేదా.. అభ్యర్థన వినతులను పరిగణనలోకి తీసుకుని ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటితో సంబంధం లేకుండా అధికార పార్టీ నేతల సిఫార్సులకు ఎడాపెడా బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 14 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ గౌతమి ఉత్తర్వు జారీ చేశారు. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, బీకే సముద్రం, బెళుగుప్ప, విడపనకల్లు.. తదితర మండలాల తహసీల్దార్ల బదిలీపై భిన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరందరూ ఐదు నెలల నుంచి సంవత్సరం లోపే వారి స్థానాల్లో పని చేశారు. ఒక్క పెద్దపప్పూరు తహసీల్దారు మాత్రం రెండున్నరేళ్లు పూర్తి అయింది. వైకాపా నేతలు చెప్పిన అడ్డమైన పనులు చేయలేదని బదిలీ చేయించినట్లు తెలుస్తోంది. బీకే సముద్రం తహసీల్దారు సైతం ఆ ప్రాంత ఖరీదైన భూములకు ఎన్‌ఓసీ కోసం సిఫార్సు చేయలేదంటూ నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. బదిలీ తప్పదంటూ కొన్ని రోజులుగా ప్రచారం చేస్తూ వచ్చారు. పెద్దవడుగూరు తహసీల్దారు వెళ్లి ఎనిమిది మాసాలే అయింది. ముక్కుసూటిగా వ్యవహరించడంతో వేటు పడినట్లు చర్చ నడుస్తోంది.
కలెక్టరేట్ ఏఓగా శ్రీధర్
కలెక్టరేట్ పరిపాలనాధికారి(ఏఓ) విజయలక్ష్మి, గుమ్మగట్ట వేణుగోపాల్‌ను బదిలీ చేసినా.. వీరిద్దరికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కలెక్టరేట్ ఏఓగా భూ సంస్కరణల తహసీల్దారు కె.శ్రీధర్‌ను నియమించారు. నార్పల తహసీల్దారు నారాయణస్వామి స్థానిక నేతల ఒత్తిడి తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఈయన స్థానంలోకి స్థానిక ఉప తసహీల్దారుకు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. కలెక్టరేట్ స్పందన తహసీల్దారు వాణిశ్రీని కళ్యాణదుర్గం ఆర్డీఓ ఏఓగా, ఇక్కడి ఏఓ భూషణంను గుంతకల్లు ఆర్డీఓ ఏఓగా బదిలీ చేశారు. సెలవులో ఉన్న రాప్తాడు తహసీల్దారు లక్ష్మినాయక్‌ను పెద్దపప్పూరు, ఇక్కడ పనిచేస్తున్న షర్మిలను ఆత్మకూరుకు పంపారు. ఇన్నాళ్లూ సెలవులో ఉన్న ఆత్మకూరు తహసీల్దారు నాగభూషణను పెద్దవడుగూరుకు, ఇక్కడ పనిచేస్తున్న ఈరమ్మను విడపనకల్లుకు బదిలీ చేశారు. విడపనకల్లు బ్రహ్మయ్యను గుమ్మగట్టకు, బీకే సముద్రం మోహన్‌కుమార్‌ను పుట్లూరుకు, ఇక్కడ పనిచేసే సుమతిని ఎల్లనూరుకు, యల్లనూరు తహసీల్దారు రమాదేవిని బీకే సముద్రానికి, బెళుగుప్ప ఈశ్వరయ్యశెట్టిని కలెక్టరేట్ స్పందనకు పంపించారు.
ఆ మూడు ఖాళీనే...
ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాప్తాడు మండలాల తహసీల్దార్ల పోస్టులను భర్తీ చేయకపోవడం విశేషం. కచ్చితంగా ప్రస్తుత సాధారణ బదిలీల్లో కొత్త వారిని నియమిస్తారని అనుకున్నారు. ఈ మూడు మండలాలకు ఎవ్వరిని నియమించకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవే కాదు... ఉరవకొండ, కూడేరు మండలాలకు ఇన్‌ఛార్జి తహసీల్దార్లు పని చేస్తున్నారు. కొత్తవారిని నియమించలేదు.
రెవెన్యూలో 114 మంది బదిలీ
జిల్లా రెవెన్యూ శాఖలో మొత్తం 114 మంది బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి ఆయా కేడర్ల వారీగా కలెక్టర్ గౌతమి, జేసీ కేతన్‌గార్గ్, డీఆర్‌ఓ గాయత్రీదేవి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్లు 14 మంది ఉండగా... ఉప తహసీల్దార్లు 17 మంది, గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ) 62 మంది, సీనియర్ సహాయకులు 16 మంది, జూనియర్ సహాయకులు/టైపిస్టులు ఐదు మంది చొప్పున ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్
-
Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్
-
భాజపా ఎమ్మెల్యే నివాసంలో యువకుడి ఆత్మహత్య: ప్రియురాలితో గొడవే కారణం