logo

తిండి పెట్టకున్నా.. బిల్లు పెట్టారు!

భిక్షాటకులకు, అనాథలకు తిండి పెట్టలేదు కానీ నాయకులు, అధికారులు మాత్రం బిల్లుపెట్టారు. పట్టెడు మెతుకులను ఏనాడూ పెట్టకుండా ఏడు నెలల్లో తాము గుత్తిలోని పట్టణ నిరాశ్రయుల వసతిగృహంలో రోజూ 70 మంది వృద్ధులు, అనాథలకు భోజనం పెట్టామని బుకాయిస్తున్నారు.

Updated : 03 Jun 2023 05:02 IST

గుత్తిలోని నిరాశ్రయుల కేంద్రం

గుత్తి, న్యూస్‌టుడే: భిక్షాటకులకు, అనాథలకు తిండి పెట్టలేదు కానీ నాయకులు, అధికారులు మాత్రం బిల్లుపెట్టారు. పట్టెడు మెతుకులను ఏనాడూ పెట్టకుండా ఏడు నెలల్లో తాము గుత్తిలోని పట్టణ నిరాశ్రయుల వసతిగృహంలో రోజూ 70 మంది వృద్ధులు, అనాథలకు భోజనం పెట్టామని బుకాయిస్తున్నారు. అనాథల భోజనం పేరుతో నిధులను బొక్కేందుకు పావులు కదుపుతున్నారు. రోజూ 70 మంది వసతిగృహంలో ఉంటున్నట్లు, ఒక్కో భోజనం రూ.45 చొప్పున పెట్టినట్లు తప్పుడు లెక్కలు రాశారు. వసతిగృహం నిర్వాహకులు చౌకబియ్యంతో అన్నం వండించి పెడుతున్నారు. రోజూ పదిమంది మాత్రమే భోజనం చేస్తున్నారు. దాతలు కూడా అనాథలకు సాయం చేస్తుంటారు. రాత్రి సమయాల్లో హోటళ్లలో మిగిలిపోయిన అన్నాన్ని తెచ్చిపెడుతుంటారు. నాయకులు మాత్రం హోటళ్ల నుంచి భోజనాలు కొనుగోలు చేసి పెడుతున్నట్లు లెక్కలు రాయించారు. ఏడు నెలల్లో రూ.14 లక్షలు వెచ్చించి భోజనాలు అనాథలకు పెట్టినట్లు రికార్డులు సృష్టించారు. అనాథలకు ఆహారం పేరుతో బిల్లులు దండుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు కుమ్మక్కై పథకం ప్రకారం బోగస్‌ బిల్లు పెట్టారు. ఇది తెలుసుకున్న కౌన్సిలర్లు అడ్డుకున్నారు. రెండు నెలల కింద నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో కొందరు కౌన్సిలర్లు బోగస్‌ బిల్లును వ్యతిరేకించారు. అజెండాలో చేర్చిన ఈ అంశాన్ని ఆమోదించకుండా అడ్డుకున్నారు. అయినా అనాథల భోజనం బిల్లును ఆమోదించినట్లు మినిట్స్‌ పుస్తకంలో రాశారు. ఇది  తెలుసుకున్న కౌన్సిలర్లు, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి గతనెల 31న నిర్వహించిన సమావేశంలో సమస్యను లేవనెత్తారు. బిల్లు చెల్లింపును తాము వ్యతిరేకించినా ఆమోదం తెలిపినట్లు ఎలా రాసుకుంటారని ధ్వజమెత్తారు. అన్న చెప్పినందుకు అలాచేశామని ఓ ప్రజాప్రతినిధి సమాధానం గమనార్హం. కౌన్సిల్‌లో బిల్లును ఆమోదించలేదని మినిట్‌్్సలో రాయించారు. ఈ బిల్లు విషయమై కమిషనర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాను రాకముందు జరిగిన వాటికి బాధ్యుడిని కాదన్నారు. తాను వచ్చిన తరువాత ఏదైనా జరిగితే బాధ్యత తీసుకుంటానని కౌన్సిల్‌ సమావేశంలో స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని