logo

చెత్త పన్ను వసూలు చేయాల్సిందే..

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో చెత్త పన్ను విధించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా ముక్కుపిండి వసూలు చేయాలని ధర్మవరం మున్సిపాలిటీ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

Updated : 03 Jun 2023 05:08 IST

జీతం నిలిపేస్తామని పారిశుద్ధ్య కార్మికులకు హెచ్చరికలు

న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం

ధర్మవరంలో చెత్త ఎత్తుతున్న కార్మికులు

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో చెత్త పన్ను విధించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా ముక్కుపిండి వసూలు చేయాలని ధర్మవరం మున్సిపాలిటీ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. వసూలు చేయకపోతే జీతం ఆపేస్తామని హెచ్చరికలు చేయడం ఆందోళన కల్గిస్తోంది. గత తెదేపా ప్రభుత్వ హయంలో ఇలాంటి పరిస్థితి లేదని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. గతంలో చెత్త పన్ను రూ.30 వసూలు చేసేవారు. అది కూడా బలవంతంగా కాదు. వైకాపా సర్కారు రూ.60 వసూలు చేస్తోంది. ఇంటింటా చెత్త సేకరించకపోయినా.. పన్ను చెల్లించాల్సిందే. లేనట్లయితే ఇచ్చే పింఛనులో కోత విధిస్తున్నారని కొందరు స్థానికులు వాపోతున్నారు. మరోపక్క సంక్షేమ పథకాలు కోత విధిస్తామని పరోక్షంగా హెచ్చరిక చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పేదలకు ప్రతి నెలా రూ.60 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఆర్థిక సంవత్సరంలో శ్రీ సత్యసాయి జిల్లాలో పన్నుల వసూళ్లలో ధర్మవరం పురపాలిక ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొదటి స్థానంలో నిలిచేందుకు ఇబ్బంది పెట్టి అయినా పన్ను వసూలు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. దీన్ని వ్యతిరేకించాల్సిన కౌన్సిలర్లు మౌనం వహించడం తగదని స్థానికులు అంటున్నారు. ఈ అంశంపై మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జునను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులో లేరు.

చెత్త పన్ను చెల్లించలేకున్నాం.. పొలంలో వేసేందుకు నిల్వ ఉంచుకున్న చెత్తపై పన్ను వేస్తున్నారు.. అని పురపాలిక పరిధిలోని గుట్టకిందపల్లి కాలనీకి చెందిన ఓ మహిళ గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం కార్యక్రమం పేరిట ఇటీవల తన ఇంటి ముందు వచ్చిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో అన్నారు. చెత్త పన్ను కట్టాల్సిందే అని ఎమ్మెల్యే బదులిచ్చారు.

ఇంటింటా తిరిగి ప్రతినెలా చెత్త పన్ను వసూలు చేయకుంటే జీతం ఆపేస్తాం..

ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో 31 సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శులకు అధికారి చేసిన హెచ్చరిక ఇది

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అష్టకష్టాలు పడి పన్ను వసూలు చేస్తున్నాం. అయినా అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. జీతాలు నిలిపేస్తామంటున్నారు.. మేమేం చేయాలి. దీర్ఘకాలిక సెలవులో వెళ్తాం.. అనుమతి ఇవ్వండి.

గతనెల 29న అదనపు కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డికి ఇచ్చిన వినతిపత్రంలో మొరపెట్టుకున్న పారిశుద్ధ్య కార్మికులు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు