logo

రహదారికి కొత్తరూపు.. రాకపోకలకు సుగమం

ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు నూతనంగా ఏర్పాటు చేసిన 342వ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే అటు కడప, ఇటు శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు ఎన్‌హెచ్‌ 342 రహదారి కీలకంగా మారనుంది.

Published : 03 Jun 2023 03:14 IST

శరవేగంగా ఎన్‌హెచ్‌ 342 విస్తరణ పనులు
న్యూస్‌టుడే, ముదిగుబ్బ

ముదిగుబ్బ-పుట్టపర్తి మార్గంలో రూపుదిద్దుకున్న జాతీయ రహదారి

ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు నూతనంగా ఏర్పాటు చేసిన 342వ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే అటు కడప, ఇటు శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు ఎన్‌హెచ్‌ 342 రహదారి కీలకంగా మారనుంది. ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం, పుట్టపర్తి, గోరంట్ల మీదుగా చిలమత్తూరు మండలంలోని కోడూరు వరకు మొత్తం 80 కిలోమీటర్లు రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. మొదటి విడతలో భాగంగా ముదిగుబ్బ - పుట్టపర్తి వరకు 32 కిలోమీటర్లు రెండు వరుసల రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. మూడు నెలల కిందట సర్వేలు చేపట్టి భూములు కోల్పోయే వారితో గ్రామసభలు నిర్వహించారు. విస్తరణ పనుల్లో భాగంగా ఇప్పటికే కల్వర్టుల నిర్మాణం, బేస్‌లెవల్‌ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. నాలుగు కిలోమీటర్ల మేరా తారురోడ్డు నిర్మించేందుకు  ఏర్పాట్లు పూర్తయినట్లు జాతీయ రహదారుల విభాగం అధికారులు చెబుతున్నారు.

ఎంతో ఉపయోగం..

పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే ముదిగుబ్బ మీదుగా ప్రయాణించడం దగ్గర మార్గం. ఇది వరకు ఉన్న రోడ్డు సక్రమంగా లేకపోవడంతో కదిరి మీదుగా ప్రయాణించేవారు. 7 మీటర్లుగా ఉన్న రహదారిని 10 మీటర్లుగా వెడల్పు చేస్తుండటంతో నిర్మాణం పూర్తయితే బెంగళూరు వెళ్లేందుకు కదిరి మీదుగా అవసరం లేకుండా ముదిగుబ్బ మీదుగా ప్రయాణం సాఫీగా సాగనుంది. ఎన్‌హెచ్‌ 342 రోడ్డు నుంచి ఎన్‌హెచ్‌ 44 బెంగళూరు హైవేకి రోడ్డు కలపడంతో రాకపోకల కష్టాలు తీరి, దూరం తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా కానుంది. ముదిగుబ్బ మండలంలో ఎన్‌హెచ్‌ 42తోపాటు, ఎన్‌హెచ్‌ 342, గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేతో ఏర్పాటు కానుండటంతో జాతీయ రహదారులతో మరింత అభివృద్ధి చెందనుంది.

త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు

జాతీయ రహదారి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాకపోకలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనల మేరకే పనులు చేపట్టాలని గుత్తేదారులకు సూచించాం. త్వరితగతిన పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

రాఘవేంద్రరావ్‌, జేఈ, ఎన్‌హెచ్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు