logo

దస్త్రాలు మార్చారు.. భూమి కాజేశారు

గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్న రైతుకు చెందిన రూ.50 లక్షలకు పైగా విలువచేసే 3.5 ఎకరాల పొలాన్ని అదే పేరున్న మరొక వ్యక్తి అమ్మేసిన ఘటన ఇది.

Published : 04 Jun 2023 06:08 IST

పంట నవీకరణకు ఒన్‌బీ తీస్తే వెలుగుచూసిన వైనం

పట్టాదారు పాసుపుస్తకం, దస్త్రాలు చూపుతున్న రైతు వెంకటాద్రి

గోరంట్ల, న్యూస్‌టుడే: గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్న రైతుకు చెందిన రూ.50 లక్షలకు పైగా విలువచేసే 3.5 ఎకరాల పొలాన్ని అదే పేరున్న మరొక వ్యక్తి అమ్మేసిన ఘటన ఇది. అసలైన రైతుకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలంటే సవాలక్ష నిబంధనలు చెప్పే రెవెన్యూశాఖ ఎలాంటి పరిశీలన, విచారణ లేకుండా సదరు పొలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీద ఒన్‌బీలోకి ఎక్కించేయడం గమనార్హం.

60 ఏళ్లకుపైగా సాగులో.. గోరంట్ల మండలం వానవోలుకు చెందిన ఎస్‌.వెంకట్రామప్ప, లచ్చుమక్క దంపతుల కుటుంబానికి 60 ఏళ్లకు పైగా గౌనివారిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నం:32లో అరెకరా, సర్వే నం: 33లో మూడెకరాలు కలిపి మొత్తం 3.5 ఎకరాల పొలం ఉంది. పక్కా పట్టాభూమి అయిన పొలాన్ని 1958లో లచ్చుమక్కకు పుట్టింటివారు కుంకుమ పసుపు పేరున చిలమత్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేయించి ఇచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండడంతో అందరూ కలిసి 06.05.1991న కుమారుడు వెంకటాద్రి పేరున దానవిక్రయం చేశారు. అప్పటి నుంచి ఆయనే సాగుచేసుకుంటున్నారు. సమీప గ్రామానికి చెందిన వెంకటాద్రి (తండ్రి వెంకట్రామప్ప) పేరున్న వ్యక్తి 2012లో తన భూమిగా పేర్కొంటూ ఓ కంపెనీకి అమ్మేశాడు. ఈ విషయం రైతులకు వారం క్రితం వరకు తెలియదు. 2022లో కూడా ఒన్‌బీ తనపేరు మీద రావడంతో పంట రుణాన్ని నవీకరణ చేసుకున్నాడు. ఈ నెలలో నవీకరణ చేసుకోవడానికి వెళ్లగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ పొలానికి ఆనుకుని బెంగళూరు - అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. ప్రభుత్వమే ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తోంది.

* గోరంట్ల మండలంలో 2012లో నకిలీ పట్టాదారు పుస్తకాలతో కొంతమంది స్థానికులు గౌనివారిపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన వందల ఎకరాల భూములను పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఓ కంపెనీకి విక్రయించారు. ఈ విషయంపై ‘ఈనాడు’లో వరుస కథనాలు వచ్చాయి. అప్పట్లో సంచలనం కావడం, పోలీసులు కేసు నమోదు చేశారు. పరిశీలించిన ఉన్నతాధికారులు కంపెనీ పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వరాదని ఆదేశాలు జారీచేయడంతో కొంతకాలం ఆపేశారు. విషయం మరుగున పడడంతో 2021 నుంచి కంపెనీ కొనుగోలు చేసిన పొలాలకు పాసు పుస్తకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే రీతిలో 14.05.2023న వెంకటాద్రికి చెందిన పొలాలకు కంపెనీపేరు మీద ఒన్‌బీలోకి ఎక్కించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలంటే అమ్మిన వ్యక్తి స్టేట్‌మెంట్‌ ఇవ్వాలి, క్షేత్రపరిశీలన జరగాలి, లింకు డాక్యుమెంట్లు జతచేయాలి.. అప్పుడే సాధ్యమౌతుంది. ఈతంతు ఏదీ జరగలేదని రైతు అంటున్నారు.

వినతి ఇవ్వాలి : రైతుకు తెలియకుండా పొలం విక్రయం జరిగిపోయిన విషయంపై కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడంతో పాటు కోర్టుకు వెళ్లాలి.
-రంగనాయకులు, తహసీల్దార్‌, గోరంట్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని