logo

కదిరిలో గేట్‌మెన్‌ నిర్లక్ష్యం.. స్టేషన్‌ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సిన గేట్‌మెన్‌ నిర్లక్ష్యంతో నాగర్‌కోయిల్‌ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌ రైలు సుమారు 19 నిమిషాలపాటు పట్టాలపై ఆగిపోవాల్సి వచ్చింది.

Updated : 04 Jun 2023 07:27 IST

క్రాసింగ్‌ సమీపాన ఆగిన రైలు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే : విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సిన గేట్‌మెన్‌ నిర్లక్ష్యంతో నాగర్‌కోయిల్‌ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌ రైలు సుమారు 19 నిమిషాలపాటు పట్టాలపై ఆగిపోవాల్సి వచ్చింది. స్టేషన్‌ సిబ్బంది, లోకోపైలెట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణం కుటాగుళ్ల వద్ద జాతీయ రహదారి 42పై ఉన్న రైల్వేగేటు వద్ద విధులు నిర్వహించాల్సిన గేట్‌మెన్‌ నరసింహులు గైర్హాజరయ్యారు. కదిరి రైల్వే స్టేషన్‌ నుంచి శుక్రవారం రాత్రి 11.50 నిమిషాలకు బయలుదేరిన నాగర్‌కోయిల్‌ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌ రైలు కిలోమీటరు దూరంలోని గేటు వేయనికారణంగా పట్టాలపై ఆగిపోవాల్సి వచ్చింది. గేటు వద్ద విధులు నిర్వహించాల్సిన గేట్‌మెన్‌ నరసింహులు అందుబాటులో లేకపోవడం, గేటు తెరిచి ఉండటాన్ని గుర్తించిన స్టేషన్‌ అధికారులు, లోకో పైలెట్‌కు సమాచారం ఇచ్చారు. గేట్‌మెన్‌కు ఫోన్‌ చేసినా ఆయన స్పందించకపోవడంతో లోకోపైలెట్‌, స్టేషన్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని గేటువేసి రైలును పంపివేశారు. రైలు వస్తున్న విషయాన్ని గుర్తించిన కొందరు వాహన చోదకులు 42వ జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులను అప్రమత్తం చేయడంతో గేటుకు ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. రైలు వెళ్లిన తరువాత గేట్లు తెరవడంతో వాహనాలు యథావిధిగా వెళ్లాయి. స్థానికులు, స్టేషన్‌ సిబ్బంది చురుగ్గా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. ఈ ఏడాది మార్చి 18న సదరు గేట్‌మెన్‌ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ట్రాక్‌ సమీపంలో భారీ వృక్షం వర్షంధాటికి కూలి పట్టాలపై పడింది. దీనిపై సమాచారం ఇవ్వని కారణంగా చెట్టును దూసుకుంటూ రైలు వెళ్లింది. ప్రయాణికులు, లోకో పైలెట్‌ అప్రమత్తమై రైలును ఆపి ప్రయాణికులే చెట్ల కొమ్మలను తొలగించారు.

సస్పెన్షన్‌ వేటు..

గేట్‌మెన్‌ నరసింహులు మిత్రుడితో కలిసి మద్యం తాగేందుకు బయటకు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. రైలు వచ్చే సమయం ఆలస్యంగా గుర్తుకురావడంతో ద్విచక్ర వాహనంపై గేట్‌వద్దకు చేరుకునే క్రమంలో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. రాత్రి ఒంటిగంట సమయంలో కదిరి ప్రాంతీయ వైద్యశాలకు చికిత్స కోసం వెళ్లారు. పట్టాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం తాగుతుండగా వారిని వారించానని, దీంతో వారు తనపై దాడిచేసి గాయపరిచారంటూ ఔట్‌పోస్టు పోలీసులకు అతను ఫిర్యాదు చేశారు. గేట్‌మెన్‌ తీరుపై అనుమానం కలిగిన రైల్వే అధికారులు అతనిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన నరసింహులును సస్పెండ్‌ చేయాలని డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి ఆదేశించారు. సస్పెండ్‌ ఉత్తర్వులను ఏడీఆర్‌ఎం సూర్యనారాయణ కదిరి స్టేషన్‌కు పంపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు