logo

జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీలకు షకీల్‌

జాతీయస్థాయి పాఠశాల క్రీడల అండర్‌-19 బాస్కెట్‌బాల్‌ పోటీలకు జిల్లాకు చెందిన ఎస్‌.షకీల్‌ ఎంపికయ్యాడు. ఉమ్మడి జిల్లా నుంచి జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన ఏకైక క్రీడాకారుడు ఈ బాలుడే కావడం విశేషం.

Published : 04 Jun 2023 06:25 IST

అనంతపురం క్రీడలు: జాతీయస్థాయి పాఠశాల క్రీడల అండర్‌-19 బాస్కెట్‌బాల్‌ పోటీలకు జిల్లాకు చెందిన ఎస్‌.షకీల్‌ ఎంపికయ్యాడు. ఉమ్మడి జిల్లా నుంచి జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన ఏకైక క్రీడాకారుడు ఈ బాలుడే కావడం విశేషం. అనంతపురం నగరానికి చెందిన షకీల్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఇండోర్‌ స్టేడియంలో శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 6 నుంచి 12 వరకు దిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పాఠశాల క్రీడల బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటాడు. పాఠశాల క్రీడల్లో తొలిసారిగా జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌.షమీయుల్లా కుమారుడైన షకీల్‌ గతంలో మూడు పర్యాయాలు జాతీయ పోటీలకు ఎంపికై సత్తాచాటాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో జరిగిన అఖిల భారతస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నాడు. ఇండోర్‌లో జరిగిన జాతీయ యూత్‌, కటక్‌లో జరిగిన సబ్‌జూనియర్స్‌ పోటీల్లో పాల్గొని జిల్లా కీర్తిని ఇనుమడింపజేశాడు. ఆరేళ్లలో 12 పర్యాయాలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా జట్లను అనేకమార్లు గెలిపించాడు. గత నెలలో తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి సీఎం కప్‌ పోటీల్లో జిల్లా జట్టుకు టైటిల్‌ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. షకీల్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ఆడాలన్నదే తన కలని తెలిపాడు. బాస్కెట్‌బాల్‌ సంఘం, డీఎస్‌ఏ శిక్షకుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగానని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని