logo

బురిడీ కొట్టించారు..!

శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మంగళ మడక గ్రామానికి చెందిన రంగమ్మకు తల్లిదండ్రులు నుంచి 1955లో 8 ఎకరాల పొలం వచ్చింది.

Updated : 07 Jun 2023 05:35 IST

భూకబ్జాపై మహిళా కమిషన్‌కు బాధితురాలి ఫిర్యాదు..
విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
బాధితురాలిని కలవకుండానే నివేదిక పంపిన జిల్లా పోలీసులు     
సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణ

రంగమ్మ

జరిగిందిదీ..

శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మంగళ మడక గ్రామానికి చెందిన రంగమ్మకు తల్లిదండ్రులు నుంచి 1955లో 8 ఎకరాల పొలం వచ్చింది. సర్వే నంబరు 30-1లో 8 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ జరగ్గా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 7.47 ఎకరాలు మాత్రమే నమోదు చేశారు. మిగిలిన 53 సెంట్లు ఎక్కించక పోవడంతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని 2021 నుంచి పలుసార్లు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. స్పందనలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రెండేళ్ల కిందట గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఆ 53 సెంట్లతోపాటు అర ఎకరాన్ని ఆక్రమించి దౌర్జన్యంగా ముళ్లకంప వేశారు. దీంతో భర్త శ్రీరాములు రెవెన్యూ, పోలీసులకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వారి తోటలో ఉన్న 50 మామిడిచెట్లను దౌర్జన్యంగా తొలగించి, విద్యుత్తు సరఫరాను నిలిపివేసి ఇబ్బందులకు గురిచేశారు. నీరు లేక మిగిలిన చెట్లు కూడా ఎండిపోయాయి. మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురైన శ్రీరాములు గత నెలలో అనారోగ్యానికి గురై చనిపోయారు. కేవలం అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే తన భర్త మృతి చెందాడని, పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రంగమ్మ రాష్ట్ర మహిళ కమిషన్‌కు మే నెలలో ఫిర్యాదు చేశారు.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: జిల్లా పోలీసులు మహిళ కమిషన్‌నే బురిడీ కొట్టించారు. భూ కబ్జాపై ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై విచారణ జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి విచారించకుండానే ఫిర్యాదుదారురాలి ఊరికి వెళ్లి ఇరు వర్గాలను విచారణ చేసినట్లు నివేదిక పంపారు. బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ రాసుకున్నట్లు నివేదికలో తెలియజేశారు. అయితే మహిళ కమిషన్‌కు పంపిన నివేదికలో పేర్కొన్నట్లు ఏ పోలీసు అధికారి తమను విచారించలేదని.. స్టేట్‌మెంట్‌లో ఉన్న సంతకం తనది కాదని, ఫోర్జరీ చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. పోలీసులు పంపించిన నివేదికను బాధితురాలికి తిరిగి పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తప్పుడు సమాచారంతో నివేదిక

ముదిగుబ్బ పోలీస్‌స్టేషన్‌

రంగమ్మ ఫిర్యాదును పరిశీలించి తగు విచారణ జరిపి నివేదిక పంపాలని జిల్లా పోలీసులకు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే ముదిగుబ్బ పోలీసులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే వెళ్లినట్లు ఓ నివేదిక రూపొందించారు. ఫిర్యాదుదారు రంగమ్మనే అవతలి వారి పొలాన్ని ఆక్రమించినట్లు, పోలీసులు సమక్షంలోనే రెవెన్యూ అధికారులు సర్వే చేసినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై ఇదివరకే హైకోర్టులో డబ్ల్యూపీ నం. 3021/2022 కేసు నడుస్తోందని నివేదికలో పేర్కొన్నారు. దీంతోపాటు అవతలి వారిపై తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని రంగమ్మ అంగీకరించి స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఆమె సంతకంతో ఓ కాగితాన్ని తయారు చేశారు. పోలీసులు మహిళా కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో ఒక్కటి కూడా నిజం లేదని రంగమ్మ ఆరోపిస్తున్నారు. పోలీసులు నివేదికలో పేర్కొన్న  రిట్‌ పిటిషన్‌ నంబరుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. రిట్‌ పిటిషన్‌ నంబరు 1321/22లో కేసు హైకోర్టులో ఉందని పేర్కొంటున్నారు. వైకాపా నాయకులతో పోలీసులు కుమ్మక్కై తప్పుడు రిట్‌ పిటిషన్‌ నంబరు వేసి నివేదిక పంపించారని, తన పేరుతో తయారు చేసిన స్టేట్‌మెంట్‌లోని సంతకం తనది కాదని, ఫోర్జరీ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. అసలు పోలీసులు తన వద్దకు వచ్చిందే లేదని చెబుతున్నారు. నివేదికను జిల్లా ఎస్పీ కూడా కనీసం పరిశీలించకుండానే మహిళా కమిషన్‌ను పంపించారని ఆమె వాపోతున్నారు. పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తానని, తన సంతకాన్ని ఫోరెన్సిక్‌కు పంపించి నిజాలు నిగ్గు తేల్చాలని బాధితురాలు డిమాండ్‌ చేస్తున్నారు.

గ్రామానికి వెళ్లి విచారించాం

మంగళమడకకు చెందిన రంగమ్మ ఫిర్యాదు మేరకు విచారణ జరపాలని మహిళా కమిషన్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు మా సిబ్బంది గ్రామానికి వెళ్లి విచారించారు. రంగమ్మ విచారణకు రాకుండానే ఆరోపణలు చేస్తున్నారు. పలుమార్లు స్టేషన్‌కు పిలిచినా రాలేదు. మహిళా కమిషన్‌కు పంపిన స్టేట్‌మెంట్‌లోని సంతకం రంగమ్మదే. తప్పుడు సంతకంతో రిపోర్టు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. అయితే మహిళా కమిషన్‌కు పంపిన నివేదికలో పొరపాటున డబ్ల్యూపీ నంబరు తప్పుగా ప్రచురితమైంది.  
- కంబగిరి రాముడు, సీఐ, ముదిగుబ్బ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు