logo

సరఫరా.. అరకొర

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై వారం రోజు గడుస్తోంది. జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అరకొరగా విత్తన పంపిణీ కొనసాగుతుంది. రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు చేరలేదు.

Updated : 07 Jun 2023 05:37 IST

ఆర్‌బీకేలకు చేరని ఎరువులు
కొన్ని కేంద్రాలకే వేరుసెనగ పంపిణీ


చేలలో పశువుల ఎరువు కుప్పలు

న్యూస్‌టుడే, జిల్లా వ్యవసాయం, పుట్టపర్తి;-  ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై వారం రోజు గడుస్తోంది. జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అరకొరగా విత్తన పంపిణీ కొనసాగుతుంది. రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు చేరలేదు. ఒకవైపు బ్యాంకుల్లో పంట రుణాల నవీకరణ జరుగుతుంది. వడ్డీలు కట్టలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు సేద్యం, విత్తన పెట్టుబడులు ఖర్చులు పెరగడంతో వీటి పనులు పుంజుకోలేదు. వ్యవసాయశాఖ సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 10,18,582 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేరుసెనగ విత్తనం ఒక్కటే పంపిణీ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. జిల్లా వ్యవసాయాధికారితోపాటు ఇతర అధికారులను బదిలీ చేసింది. పంపిణీ, నాణ్యత చూసేవారు కరవయ్యారు.

6.35 లక్షల ఎకరాల్లో వేరుసెనగ

జిల్లాలో 6,35,022 ఎకరాల్లో వేరుసెనగ సాగు కానుంది. పత్తి 1,41,932 ఎకరాలు, కంది 83,135, వరి 47,962, మొక్కజొన్న 23,182, జొన్న 19,365, ఉలవలు 12,457, ఆముదం 34,275 , పొద్దు తిరుగుడు 5,440, చిరుధాన్యాలు 4,527, పెసర 4,392, సజ్జ 3,712, సోయాబీన్‌ 1,365 ఎకరాల్లో పంటలు సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

*జిల్లాకు అన్ని రకాల విత్తనాలు కలిపి 85,322 క్వింటాళ్లు కేటాయింపులు జరిగాయి. రైతు భరోసా కేంద్రాల్లో ఒక్క వేరుసెనగ విత్తనం పంపిణీ మాత్రమే సాగుతోంది. మిగిలిన విత్తనాలు రైతుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అత్యధికంగా వేరుసెనగ విత్తనాలు 78,245 క్వింటాళ్లు, కంది 4,300, ఉలవలు 825, వరి 1500, పెసలు 156, ఉద్దులు 42, పచ్చిరొట్ట ఎరువులు 202, కొర్ర 50, రాగులు కేవలం 3 క్వింటాళ్లు కేటాయించారు. వేరుసెనగ విత్తనం కావాలని ఆర్‌బీకేల్లో ఇప్పటికే 58,380 మంది రైతులు 50,834 క్వింటాళ్లు కావాలని పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 13,402 మంది రైతులకు 12,161 క్వింటాళ్లు మాత్రమే వేరుసెనగ పంపిణీ చేశారు. ఇతర విత్తనాల పంపిణీ ఊసేలేదు.

నాణ్యతలో సందేహాలు : జిల్లాలో 8 వేరుసెనగ ప్రాసెసింగ్‌ యూనిట్లలో విత్తనశుద్ధి సాగుతోంది. ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాలకు ఇండెంట్‌ ప్రకారం లారీలు పంపుతున్నారు. 730 క్వింటాళ్లు విత్తనం నాసిరకంగా ఉండటంతో లారీలు వెనక్కి పంపడం జరిగిందని వ్యవసాయాధికారులు తెలిపారు.

ఎరువులు

ఎరువులు నెలవారీగా ప్రణాళికలు వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. జూన్‌ నెలకు సంబంధించి అన్ని రకాల ఎరువులు కలిపి మొత్తం 12,763 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. అందులో యూరియా 4,379, డీఏపీ 1,279, కాంప్లెక్స్‌ ఎరువులు 3,915, మ్యూరేట్‌ ఆఫ్‌ పోటాష్‌ 960, సింగల్‌ సూఫర్‌ పాస్పేట్‌ 2,204 మెట్రిక్‌ టన్నులు ఎరువులు కేటాయించారు. ఆర్‌బీకేలకు ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా ఎరువులు సరఫరా చేయాల్సి ఉంది. అయితే చాలా ఆర్‌బీకేలకు ఎరువులు చేరలేదు.

*150 ఆర్‌బీకేలకు 2,810 మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులు నిల్వ ఉందని, మరో 259 ఆర్‌బీకేల్లో 377 మెట్రిక్‌ టన్నులు ఎరువులు అందుబాటులో ఉంచామని ఏపీ మార్క్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు. ఇంకా 42 ఆర్‌బీకేలకు ఎరువులు చేరలేదని వ్యవసాయశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ఇన్‌ఛార్జులు కావాల్సిన ఎరువులు ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పంపితేనే ఆర్‌బీకేలకు ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎరువులు సరఫరా చేస్తుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం.

15 తర్వాత విత్తుకోవచ్చు

నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కొన్నిచోట్ల ఇప్పటికే రైతులు విత్తుకు సిద్ధం చేసుకున్నారు. వానలు వస్తే విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 15 తర్వాత వేరుసెనగ, ఇతర పంటలు విత్తుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. జూలై నెలాఖరు వరకు విత్తు వేసుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ మల్లీశ్వరీ సూచిస్తున్నారు.

ఖరీఫ్‌కు సిద్ధం

రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. వేరుసెనగ విత్తనాలను ప్రతి ఆర్‌బీకే పరిధిలో మండల వ్యవసాయాధికారులు తనిఖీ చేస్తున్నారు. నాణ్యత లేకపోతే వెనక్కి పంపుతున్నాం. విత్తన నాణ్యతపై సందేహం లేదు. రైతులందరికీ మేలైన విత్తనం పంపిణీ చేస్తాం.
ఉమామహేశ్వరమ్మ-డీఏవో (అనంతపురం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని