logo

వేసవి వెన్నెల.. బోధన భళా!

వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఉరవకొండకు చెందిన నిస్వార్థ, హైదరాబాద్‌కు చెందిన అభయ స్వచ్ఛంద సంస్థలు ‘వేసవి వెన్నెల’ పేరుతో ఉచిత శిక్షణ అందిస్తున్నాయి.

Published : 07 Jun 2023 05:16 IST

వివిధ ఉపకరణాలు తయారు చేస్తున్న విద్యార్థులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఉరవకొండకు చెందిన నిస్వార్థ, హైదరాబాద్‌కు చెందిన అభయ స్వచ్ఛంద సంస్థలు ‘వేసవి వెన్నెల’ పేరుతో ఉచిత శిక్షణ అందిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 60 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారికి ఉరవకొండలోని కరిబసవస్వామి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెల రోజుల కిందట శిక్షణను ప్రారంభించారు. ఇక్కడ విద్యార్థులకు యోగా, ఆధ్యాత్మికత, నైతిక విలువలకు సంబంధించిన అంశాలు బోధిస్తున్నారు. వాటితోపాటు ప్రార్థన, గీతా శ్లోకాలు, శతక పద్యాలు, దేశభక్తి గీతాలు, సత్యసాయి పద్య సూక్తులు, చిన్న కథలు, ఆధ్యాత్మిక భజనలు, ఆటలు, ఆరోగ్యం, ఆదర్శ సూత్రాలు, కోలాటం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 10 మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులు శిక్షణల్లో భాగస్వాములవుతున్నారు. ఈ తరగతులు రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు వారికి కేటాయించిన వేళల్లో విశ్లేషణాత్మకంగా బోధిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. శిక్షణలో విద్యార్థులకు మధ్యాహ్నం రుచికర భోజనం.. ఉదయం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలపై వివిధ ఉపకరణాలు తయారు చేసి చక్కటి ప్రతిభ చూపుతున్నారు.

చిన్నతనంలోనే మంచి నేర్పాలని..

యోగా సాధన చేస్తూ..

పిల్లలకు చిన్నతనంలోనే మంచిని నేర్పుతూ, వారు తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించేలా నేర్పాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ప్రారంభించాం. నెల రోజులపాటు జరిగిన తరగతుల్లో వారికి ఎన్నో విషయాలు నేర్పాము. చదువుతోపాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన కల్పించాం. - సునీత, శిక్షణ సమన్వయకర్త

సాయం చేసే భావన అలవడింది

శిక్షణలో చాలా అంశాలు తెలుసుకున్నా. ఉపాధ్యాయులు యోగాతో పాటు మరిన్ని విషయాలు చక్కగా బోధించారు. నేను ఇతరులకు సాయం చేయాలన్న భావనను అలవర్చుకున్నా. సాయం చేయడంలో ఎంత ప్రాధాన్యం ఉందో శిక్షణకు వచ్చిన తరువాత తెలిసింది. దాన్ని భవిష్యత్తులో పాటిస్తాను. - హర్షిత, విద్యార్థిని

అందరూ సమానమే అని తెలిసింది

శిక్షణలో అందరూ సమానమే అని తెలుసుకున్నా. మాకు నేర్పిన ప్రార్థన, గీతా శ్లోకాల ద్వారా అనేక అర్థాలు తెలిశాయి. శతక పద్యాలు ఇట్టే చెప్పేస్తాం. వాటికి భావాలను ఉపాధ్యాయులు వివరించారు. - చందన, విద్యార్థిని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని