logo

సరిహద్దులు దాటుతున్న సర్కారు బియ్యం

పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం అక్రమార్కుల పాలవుతోంది. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పుట్టపర్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

Updated : 07 Jun 2023 05:39 IST

ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా దందా
తూతూ మంత్రంగా తనిఖీలు

పావగడ నుంచి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్న పీడీఎస్‌ బియ్యం లారీతో అధికారులు

న్యూస్‌టుడే, పుట్టపర్తి, మడకశిర;-పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం అక్రమార్కుల పాలవుతోంది. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పుట్టపర్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పేదల నుంచి చౌక బియ్యాన్ని స్థానిక చిరు వ్యాపారులు కొనుగోలు చేసి రైస్‌ మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ-పాస్‌ మిషన్లను తీసుకువచ్చినా అక్రమ దందా ఆగడం లేదు. కొన్ని గ్రామాల్లో రేషన్‌ డీలర్లే లబ్ధిదారుల నుంచి బియ్యం తీసుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. బియ్యం తరలిస్తూ పదే పదే పట్టుబడితే పీడీ యాక్టు ప్రయోగిస్తామని అధికారులు చెబుతున్నా.. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో వ్యాపారులు భయంలేకుండా అక్రమ రవాణా సాగిస్తున్నారు.

పావగడ కేంద్రంగా..

ఉమ్మడి జిల్లాలోని రొద్దం, మడకశిర, గుడిబండ, అమరాపురం, పెనుకొండ, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, రామగిరి తదితర మండలాలు కర్ణాటక రాష్ట్రం పావగడ నియోజకవర్గానికి సరిహద్దులో ఉన్నాయి. పావగడ పట్టణం కేంద్రంగా పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా బాగోతం కొన్నేళ్లుగా సాగుతోంది. కార్డుదారుల నుంచి రూ.10-రూ.13లకు కొనుగోలు చేసి పావగడలోని రైస్‌మిల్లుకు తరలించి రీసైక్లింగ్‌ చేసి లారీల్లో మడకశిర మీదుగా తుమకూరు, శిరా, బెంగళూరు పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు అక్రమరవాణా విషయంలో చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

రాజకీయ నేతల అండదండలతో..

అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వారు కేసులకు ఏ మాత్రం భయపడటం లేదు. అరెస్టు చేసిన నిందితులపై 6ఏ కేసులు నమోదు చేసి పంపుతున్నా.. దందా ఆపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారికి పలువురు అధికార పార్టీ నాయకులు, పోలీసు అధికారుల అండదండలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రాత్రి వేళల్లో బియ్యం లారీలను మడకశిర నుంచి సరిహద్దు దాటించడానికి నాయకులు, అధికారులే సహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుకున్న అక్రమ బియ్యం లారీలు, నిందితులు పావగడకు చెందిన వారే కావడం గమనార్హం.

కొన్ని ఉదాహరణలు..

*2022 మే 9న పావగడ నుంచి తుమకూరుకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం లారీని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. 260 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకొని ఇద్దర్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

*2022 డిసెంబరు 14న మడకశిర సమీపంలోని రాజీవ్‌గాంధీ కూడలిలో కర్ణాటక రాష్ట్రం మధుగిరికి తరలివెళ్తున్న 180 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం లారీని పట్టుకుని ఇద్దర్ని అరెస్టు చేశారు.

*ఈ ఏడాది ఫిబ్రవరి 6న పావగడ నుంచి రాత్రి వేళలో లారీలో అక్రమంగా వెళ్తున్న 165 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.

*పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం రెడ్డిపల్లి రైస్‌బిల్లులో రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేశారు. నల్లమాడ, అమడగూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్రమ బియ్యం తరలింపుపై ఆరు కేసులు నమోదు చేశారు. నల్లమాడ పోలీస్‌స్టేషన్‌లో ఒకే వ్యక్తిపై నాలుగు కేసులు నమోదు కావడం గమనార్హం.

ప్రత్యేక నిఘా ఉంచాం

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్ణాటక సరిహద్దులో బియ్యం, అక్రమ మద్యం రవాణా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఎలాంటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తి లేదు. పావగడలోని పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చాం. మడకశిర కర్ణాటక సరిహద్దు కావడంతో పోలీసు, విజిలెన్స్‌, రవాణా శాఖ ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం.
వాసుదేవన్‌, డీఎస్పీ, పుటపర్తి, - సురేష్‌బాబు, సీఐ, మడకశిర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని