logo

Anantapur: అమ్మను వదిలి వెళ్లిపోతివా ఐశ్వర్యా..

ఇంటికొచ్చినప్పటి నుంచీ నా చుట్టూ తిరుగుతుంటివే.. ఎలా వెళ్లిపోయావు ఐశ్వర్యా అంటూ ఆ తల్లి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

Updated : 08 Jun 2023 07:14 IST

ఐశ్వర్య (దాచిన చిత్రం)

కదిరి పట్టణం: ఇంటికొచ్చినప్పటి నుంచీ నా చుట్టూ తిరుగుతుంటివే.. ఎలా వెళ్లిపోయావు ఐశ్వర్యా అంటూ ఆ తల్లి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న ఆ బాలికను విద్యుదాఘాతం రూపంలో మృత్యువు కబళించింది. కుటుంబంలో విషాదాన్ని నింపింది.   తోటిపిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఐశ్వర్య (13) బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.  వైఎస్సార్‌ నగర్‌ సమీపంలో నివాసం ఉంటున్న కర్ణ, గంగరత్న దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. మొదటి సంతానం ఐశ్వర్య అనంతపురంలోని ఆర్డీటీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలిక మరో మూడు రోజుల్లో పాఠశాలకు వెళ్లేందుకు, పుస్తకాలు దుస్తులు సిద్ధం చేసుకుంది. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ నిచ్చెన నుంచి మిద్దెపైకి ఎక్కుతూ విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయింది. తోటి పిల్లలు కేకలు వేయడంతో గంగరత్న స్థానికులతో కలిసి బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే  మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

బత్తలపల్లికి వెళ్లుంటే  బతికేది..

నా బిడ్డను బత్తలపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేది. అంబులెన్స్‌ రాకపోవడంతో నా కూతురును పోగొట్టుకున్నానంటూ తల్లి గంగరత్న బోరున విలిపించింది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఐశ్వర్య ఫస్ట్‌ అంటుంటే సంబరపడిపోతుంటినే.. ఇంకెవరినీ చూసి సంబరపడాలి అంటూరోదించింది. అందరితో కలివిడిగా ఉండే ఐశ్వర్య మరణించిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆసుపత్రి వద్దకు చేరుకుని 13 ఏళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ కన్నీరుమున్నీరయ్యారు.

తక్కువ ఎత్తులో విద్యుత్తు తీగలు

వైఎస్సార్‌ నగర్‌లో విద్యుత్తు సబ్‌స్టేషన్‌కు ఆనుకుని ఉన్న నివాసాల మీదుగా తక్కువ ఎత్తులో విద్యుత్తు తీగలు వేలాడుతూ ఉన్నాయి. పిల్లలతో కలిసి ఇంటిపైకి వెళ్లేందుకు ప్రయత్నించి ఐశ్వర్య వాటిని గుర్తించక ప్రమాదానికి గురై మృతి చెందింది. బాలిక మృతి విషయం తెలుసుకున్న ఆర్డీటీ సిబ్బంది కర్ణ, గంగరత్న దంపతులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు