logo

కోరిన చోటు వస్తుందా.. రాదా?

సాధారణ బదిలీల ప్రక్రియ గత నెల 31తో ముగిసినా జిల్లా జలవనరుల శాఖలో మాత్రం ఎడతెగని ఉత్కంఠ నడుస్తోంది.

Published : 08 Jun 2023 05:58 IST

గడువు ముగిసినా అందని జాబితా
జలవనరుల శాఖ ఇంజినీర్లలో ఉత్కంఠ

జలవనరుల సీఈ కార్యాలయం

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: సాధారణ బదిలీల ప్రక్రియ గత నెల 31తో ముగిసినా జిల్లా జలవనరుల శాఖలో మాత్రం ఎడతెగని ఉత్కంఠ నడుస్తోంది. ప్రభుత్వ స్థాయిలో తీవ్ర అయోమయం, గందరగోళం నెలకొనడమే కారణం. గత నెల 31న అన్ని కేడర్ల ఇంజినీర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ (పరిపాలన) సతీష్‌కుమార్‌ ప్రత్యేక ఉత్తర్వు సైతం జారీ చేశారు  వారం గడిచినా బదిలీల జాబితా మాత్రం జిల్లాకు చేరలేదు. రాజకీయ పైరవీలు, సిఫార్సుల క్రమంలో బేరసారాల్లో తేడా రావడంతోనే బదిలీల జాబితా జిల్లాకు చేరనట్లు ఇంజినీర్లలో విస్తృత చర్చ నడుస్తోంది. ఇప్పటికీ పదుల సంఖ్యలో ఇంజినీర్లు ఆ శాఖ రాష్ట్ర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే కేడర్‌ను బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు దాకా ముడుపుల బాగోతం యథేచ్ఛగా సాగినట్లు తెలుస్తోంది. ఈ తతంగంలో వీలైనంత పిండుకోవాలన్న ఉద్దేశంతో బదిలీ జాబితా జారీలో జాప్యం చేస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇంజినీర్లు మాత్రం బదిలీ జాబితా కోసం ఎదురుచూస్తున్నారు.


ఆ మూడింటిలో వంద

జిల్లా జలవనరుల శాఖ పరిధిలో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఇందులో హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌), హెచ్చెల్సీ ప్రాజెక్టు, చిన్ననీటి పారుదల (ఎంఐ) ఉన్నాయి. ఏఈఈ, డీఈఈ, ఈఈ, ఉప ఈఈ, ఎస్‌ఈ, సీఈల దాకా ఈ మూడు విభాగాల్లో పని చేస్తున్నారు. అన్ని కేడర్లల్లో వంద మందికి బదిలీలు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకే స్థానంలో ఐదేళ్లు సర్వీసు నిండిన ఇంజినీర్లు, భార్యభర్తలు (స్పౌజ్‌), అనారోగ్యం, అభ్యర్థన దరఖాస్తులు... ఇలా అన్ని రకాల దరఖాస్తులు ఈఎన్‌సీ (పరిపాలన)కు వెళ్లాయి. ఈ తతంగం గత నెల ఆఖరు వారంలోనే పూర్తి అయింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాధారణ బదిలీల ప్రక్రియ గత నెల 31తో ముగించాలి. జలవనరుల శాఖలో అసలు బదిలీలే జరగలేదు.


వారంలోపు చేరకపోతే చర్యలు

గతనెల 31న ఉత్తర్వు వెలువడింది. ఇంజినీర్ల పేర్లతో జాబితా రాలేదు. బదిలీ ఉత్తర్వులో మాత్రం కొత్త స్థానాల్లో వారం లోపు చేరాల్సిందేనని పేర్కొన్నారు. సరిగ్గా బుధవారం నాటికి వారం రోజులు గడిచాయి. అయితే.. జాబితా మాత్రం ఇప్పటికీ రాలేదు. శాఖ పరంగా క్రమశిక్షణ చర్య ఎవ్వరిపై తీసుకుంటారన్న వాదన తెరపైకి వచ్చింది. బదిలీ ఉత్తర్వులు వస్తాయన్న ఆశతో అన్ని కేడర్ల ఇంజినీర్లు వారం రోజులుగా నిరీక్షిస్తున్నారు. రోజువారీ విధులపై అసలు దృష్టి సారించలేని దుస్థితి నెలకొంది. ముడుపులు ముట్టజెప్పిన ఇంజినీర్లల్లో ఆందోళన, ఉత్కంఠ ఆవరించింది. కోరిన స్థానం వస్తుందా.. లేదా అన్న సందిగ్ధంలో పడ్డారు.


త్వరలో ఉత్తర్వులు రావచ్చు..

బదిలీ ఉత్తర్వు వచ్చింది. కానీ.. జాబితా రావాల్సి ఉంది. త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాం. ఈ బదిలీ ప్రక్రియ మొత్తం రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుంది. ఈ జాబితా రాగానే కొత్త స్థానాల్లో చేరే విషయంపై ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేస్తాం.

దేసేనాయక్‌, ఎస్‌ఈ, హంద్రీనీవా

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని