logo

‘విద్యుత్తు వినియోగదారులపై మోయలేని భారం’

రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులపై ప్రభుత్వం మోయలేని భారం మోపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించారు.

Published : 08 Jun 2023 05:58 IST

సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జగదీష్‌, జాఫర్‌ తదితరులు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులపై ప్రభుత్వం మోయలేని భారం మోపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించారు. బుధవారం గుంతకల్లుకు సమీపంలోని కసాపురం గ్రామంలో పార్టీ కార్యకర్తల శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా గుంతకల్లు పట్టణంలోని బీటీ ఫక్కీరప్ప భవనంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే ప్రజలపై భారాన్ని మోపుతున్నారన్నారు. ట్రూప్‌ అప్‌ ఛార్జీల పేరుతో పెంచారని, స్మార్ట్‌ మీటర్లు ప్రజలకు అవసరం లేకపోయినా.. అదానీకి లాభం చేకూర్చేందుకు బిగిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 2020 డిసెంబరులోనే నీరు అందిస్తామని చెప్పారని గుర్తుచేశారు. మూడు నెలల క్రితం పోలవరాన్ని సందర్శించగా.. 2025 వరకు ప్రాజెక్టు పూర్తి కాదని అక్కడి అధికారులు చెప్పారన్నారు. ఎన్నికల వస్తున్నాయి కాబట్టి ఎలాగైనా నీరు పారించాలని అంటున్నారు.. ఇన్నాళ్లు నీరు ఇవ్వకుండా నిద్రపోయారా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ నిర్ణయాలు రాయలసీమ జిల్లాల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. కర్ణాటకలో ఎగువ భద్ర ప్రాజెక్టుతో సీమ రైతులు, ప్రజలు త్రీవంగా నష్టపోతారని అన్నారు. ఈనెల 10 నుంచి 20 వరకు 32 మండలాల్లో రైతు గర్జన ప్రచార జాతను నిర్వహించి, రాయలసీమ జిల్లాలో ప్రాజెక్టులపై సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. సీపీఐ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు జగదీష్‌ మాట్లాడుతూ దేశంలోనే అనంతపురం జిల్లాలో వేరుసెనగ పంటను అధికంగా పండించే వారనీ.. ఇప్పుడు విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగిపోయాయన్నారు. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి అవుతుండటంతో సాగు తగ్గుతోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, కార్యవర్గ సభ్యులు గోవిందు, నియోజకవర్గ  కార్యదర్శి వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని