logo

ఉల్లాసంగా చేరి.. విలువిద్యలో ఆరితేరి

ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు ఈ సెలవులను ఉల్లాసంగా గడపాలని కోరుకుంటారు.

Published : 08 Jun 2023 05:58 IST

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు ఈ సెలవులను ఉల్లాసంగా గడపాలని కోరుకుంటారు. ఆటల్లో ప్రవేశించాలనుకున్న పిల్లలు వేసవి సెలవుల్ని ఒక వరంగా భావిస్తారు. భావి ఛాంపియన్లుగా ఎదగాలని లక్ష్యం నిర్ధేశించుకుంటారు. రెండో కోవకు చెందిన పలువురు చిన్నారులు సెలవులు ప్రారంభం కాగానే విలువిద్య (ఆర్చరీ) సాధన ప్రారంభించారు. అనంత క్రీడాగ్రామంలో ఆర్డీటీ ప్రత్యేకంగా విలువిద్యపై వేసవి శిక్షణ శిబిరం నిర్వహించింది. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులు 50 మంది వరకు శిక్షణ పొందారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న బాలబాలికలు ఇందులో శిక్షణ పొందారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎంతో ప్రాచుర్యం పొందిన విలువిద్యపై పట్టు సాధించారు. విలువిద్యలోని ఇండియన్‌, రికర్వ్‌, కాంపౌండ్‌ అంశాల్లో రాటుదేలారు.


పతకం సాధిస్తా

నా పేరు బి.యజ్ఞప్రియ. అనంతపురం గ్రామీణ మండలం ఆకుతోటపల్లి గ్రామం. తండ్రి ఆనంద్‌ డ్రైవరు. తల్లి గృహిణి. మూడో తరగతిలోకి ప్రవేశించాను. నెలరోజులపాటు అనంత క్రీడాగ్రామంలో విలువిద్యలో ఇండియన్‌ అంశంలో తర్ఫీదు పొందాను. శిక్షణ తర్వాత ఆటపై మమకారం పెరిగింది. చదువుతో పాటు ఆర్చరీలో కూడా ఏదైనా సాధించి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశయం. ఆర్డీటీ ప్రోత్సాహంతో జాతీయ పోటీల్లో పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. సెలవుల తర్వాత కూడా పూర్తి స్థాయిలో సాధన చేస్తాను. మరింత మేలైన శిక్షణ తీసుకుంటా.. జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంటా. ఆరోగ్యంగా ఎలా జీవించాలో శిక్షణ ద్వారా అర్థమైంది.


ఛాంపియన్‌ నా కల

నా పేరు జి.తన్విత. మాది అనంతపురం గ్రామీణ మండలం ఆకుతోటపల్లి గ్రామం. ప్రస్తుతం రెండో తరగతి నుంచి మూడో తరగతిలో ప్రవేశించా. నెలరోజుల నుంచి ఆర్చరీలో శిక్షణ పొందాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆర్డీటీ సహకారంతో ఆర్చరీలో ఎంతో నేర్చుకున్నా. సెలవులు ముగిసినా నిరంతరం సాధన చేస్తా. జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా నిలవాలన్నదే నా కల. సాకారం చేసుకోవడానికి కఠోరంగా పరిశ్రమిస్తా. ఫిట్‌నెస్‌పై కూడా అవగాహన కల్పించారు.


ఉన్నత శిఖరాలను అధిరోహిస్తా

నా పేరు జి.నిఖిత. మా తండ్రి శివ తాపీ మేస్త్రీ. తల్లి గృహిణి. వారి ప్రోత్సాహంతో ఆర్చరీలో అడుగుపెట్టాను. ఆర్డీటీ వేసవి శిక్షణ శిబిరంలో నెలరోజులపాటు శిక్షణ తీసుకున్నా. విలువిద్యలో ఇండియన్‌ అంశంలో పట్టు సాధించా. పోటీల్లో గెలుస్తానన్న ఆత్మవిశ్వాసం కలిగింది. తొమ్మిదో తరగతికి ప్రవేశించిన నాకు జాతీయ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలనే కోరిక ఉంది. శిక్షణ ముగిసిన తర్వాత కూడా నిరంతర సాధన చేస్తా. భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారిణిగా, ఉన్నత ఉద్యోగినిగా ఎదగడానికి కష్టపడతా. శిక్షణ శిబిరంతో గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు