ఎట్టకేలకు వారియర్స్ జట్టు విజయం
అనంత క్రికెట్ లీగ్ పోటీల్లో వరుస ఓటములతో కుంగిపోయిన కోగటం వారియర్స్ జట్టుకు ఓ విజయం దక్కింది.
బహుమతి అందుకుంటున్న అర్జున్ తెందూల్కర్
అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: అనంత క్రికెట్ లీగ్ పోటీల్లో వరుస ఓటములతో కుంగిపోయిన కోగటం వారియర్స్ జట్టుకు ఓ విజయం దక్కింది. బుధవారం అనంత క్రీడాగ్రామంలో జరిగిన తొలి పోటీలో వారియర్స్ జట్టు శరవణ స్లగ్గర్స్ జట్టును 21 పరుగుల తేడాతో ఓడించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న శరవణ జట్టుకు కళ్లెం పడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన వారియర్స్ జట్టు 19.5 ఓవర్లలో 143 పరుగులే చేసింది. బ్యాట్స్‌మెన్‌లు అంకిత్ (32), యోగానంద (31)లు పోరాటం చేయడంతో గౌరవప్రదమైన స్కోరు లభించింది. అనంతరం స్వల్ప విజయ లక్ష్యంతో బరిలో దిగిన శరవణ జట్టు ప్రత్యర్థి బౌలింగ్ దెబ్బకు 18.2 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. వారియర్స్ బౌలర్లు వినయ్‌కుమార్, ప్రదీప్‌రెడ్డి, సంతోష్‌లు చెరో రెండు వికెట్లు కూల్చి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. రెండో పోటీలో అనంత రైజింగ్ స్టార్స్ జట్టు స్పార్టన్స్ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్పార్టన్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగా ప్రతిగా రైజింగ్ స్టార్ జట్టు కేవలం ఒక వికెట్ కోల్పోయి 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అలవోకగా సాధించింది. బ్యాటర్లు అర్జున్ తెందూల్కర్ (66) అద్భుత బ్యాటింగ్‌తో అలరించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీ సమన్వయకర్త దాదా ఖలందర్ బి.సంతోష్‌కు, ఏఎస్‌ఏ అకాడమీల మేనేజరు వంశీకృష్ణ అర్జున్ తెందూల్కర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందజేశారు. ఈ పోటీలను ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధుసూదన్, డాక్టర్ సుప్రజాచౌదరిలు పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.