వేర్వేరుగా ముగ్గురు రైతుల బలవన్మరణం
పంటలు సాగుచేసి నష్టపోయిన ముగ్గురు రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలోని తిమ్మాపురంలో యువ రైతు రాము (30) అప్పుల బాధ తాళలేక శనివారం రాత్రి పురుగుమందు తాగాడు.
రాము, చెన్నారెడ్డి, నాగేంద్ర (పాత చిత్రాలు)
పెద్దవడుగూరు, గార్లదిన్నె, ధర్మవరం, న్యూస్‌టుడే: పంటలు సాగుచేసి నష్టపోయిన ముగ్గురు రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలోని తిమ్మాపురంలో యువ రైతు రాము (30) అప్పుల బాధ తాళలేక శనివారం రాత్రి పురుగుమందు తాగాడు. తనకున్న రెండెకరాలతోపాటు మరో తొమ్మిది ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగుచేయగా.. అధిక వర్షాలు, పురుగు బెడద కారణంగా పంట పూర్తిస్థాయిలో నష్టపోయాడు. సుమారు రూ.6 లక్షల అప్పు ఎలా తీర్చాలన్న మనోవేదనకు గురై ఇంటిలో ఉన్న పురుగుమందు తాగి అపస్మారకస్థితిలో పడిపోగా.. బంధువులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందినట్లు చెప్పారు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
- శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలోని మర్తాడుకు చెందిన నాగేంద్ర (37) అనే కౌలు రైతు ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు అన్నదమ్ముల పొలం కౌలుకు చేసుకుంటూ భార్య, ఇద్దరు కుమారులను పోషించేవాడు. చీనీ, వరి పంటలకు పెట్టిన పెట్టుబడి చేతికందక అప్పుల పాలవడంతో కుటుంబ పోషణకు చేసిన అప్పులు అధికమై భార్య ఇంటిలో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
- శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సుందరయ్యనగర్‌కు చెందిన రైతు చెన్నారెడ్డి (42) ఆదివారం విషపుగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. రేగాటిపల్లి సమీపంలోని పొలాల వద్ద అపస్మారకస్థితిలో పడి ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. రామగిరి మండలం పెనుబోలు గ్రామానికి చెందిన చెన్నారెడ్డి కొంతకాలంగా ధర్మవరంలోని సుందరయ్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. తనకు రామగిరి మండలంలో ఉన్న ఆరు ఎకరాల పొలంలో కంది, వేరుసెనగ పంటలు వేసి నష్టపోయాడు. పంట పెట్టుబడికి, కుటుంబ పోషణకు చేసిన రూ.8 లక్షల అప్పు ఎలా తీర్చాలోనని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రాయితీపై శనగపప్పు.. ‘భారత్ దాల్’ కిలో రూ.60కే..
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
-
Congress: కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్!
-
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన
-
Weather Update: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
-
‘ప్రతిపక్ష అభ్యర్థులను పశువుల్లా కొన్నాం’