logo

తల్లిదండ్రులు లేరు.. అమ్మఒడికీ దూరమయ్యా!

కల్టెకర్‌ గారూ..! మా అమ్మా, నాన్న చనిపోయారు. అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నా. అమ్మఒడి పథకం మంజూరు చేస్తే చదువుకుంటా. దీనికోసం రెండేళ్లుగా తిరుగుతున్నా ప్రయోజనం లేదంటూ జిల్లా పాలనాధికారి

Updated : 24 May 2022 06:23 IST

కలెక్టర్‌కు విద్యార్థి వినతి

బాలుడి సమస్య వింటున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

బాపట్ల, న్యూస్‌టుడే: కల్టెకర్‌ గారూ..! మా అమ్మా, నాన్న చనిపోయారు. అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నా. అమ్మఒడి పథకం మంజూరు చేస్తే చదువుకుంటా. దీనికోసం రెండేళ్లుగా తిరుగుతున్నా ప్రయోజనం లేదంటూ జిల్లా పాలనాధికారి విజయకృష్ణన్‌కు ఆరో తరగతి విద్యార్థి కోరపాటి మణికంఠరాజు సోమవారం ఫిర్యాదు చేశాడు. అమ్మఒడి పథకం మంజూరు చేయించి తన చదువుకు ప్రభుత్వ సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు. అద్దంకి నియోజకవర్గం జె.పంగులూరు మండలం బయటమంజులూరు గ్రామానికి చెందిన ఇతను గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే తండ్రి, గతేడాది మే 22న విద్యార్థి తల్లి సుబ్బలక్ష్మి మృతిచెందారు. స్థానికంగా తెల్లరేషన్‌కార్డు లేదనే కారణంతో 2020లో ఇతనికి అమ్మఒడి మంజూరు కాలేదు. రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోగా కార్డు మంజూరైంది. అయినా పథకం ప్రయోజనం దక్కలేదు. దీంతో బయటమంజులూరు గ్రామం నుంచి బాపట్లలో కలెక్టరేట్‌కు సోమవారం వచ్చిన విద్యార్థి పాలనాధికారి విజయకృష్ణన్‌ను కలిసి అర్జీ అందజేశాడు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ విద్యార్థికి అమ్మ ఒడి పథకం అందేలా చర్యలు తీసుకోవాలని డీఈవో రామారావును ఆదేశించారు. డీఈవో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థి అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడని తెలిపారు. తల్లి మృతి చెందినందున రేషన్‌కార్డులో అమ్మమ్మ పేరును సంరక్షకురాలిగా చేర్చితే అమ్మఒడి మంజూరు చేయిస్తామన్నారు. అతని అమ్మమ్మ బ్యాంకు ఖాతాలో నగదు జమవుతుందని పేర్కొన్నారు. జె.పంగులూరు మండల అధికారులతో మాట్లాడి విద్యార్థి మణికంఠరాజుకు అమ్మఒడి అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని