AP News: అభిమానం ఉంచుకోండి.. నాలా తన్నులు తినకండి
గాయపడిన వైకాపా కార్యకర్త ఆవేదన
గాయాలతో అమ్ముకుట్టి
పుంగనూరు, న్యూస్టుడే: ‘నాయకుల మీద అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి. నాలా తన్నులు తినకండి’ అని వైకాపా కార్యకర్త ఆవేదన వ్యక్తంచేశారు. పుంగనూరు బీఎంఎస్ క్లబ్ ఆవరణలో శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవాసంఘం ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సభావేదికపైకి వెళ్లిన తనను స్థానిక సీఐ గంగిరెడ్డి అడ్డుకొని తోయడంతో పక్కనే ఉన్న శ్రీకృష్ణదేవరాయుల విగ్రహంపై పడటంతో తలకు గాయమైందని పట్టణానికి చెందిన వైకాపా కార్యకర్త మహబూబ్ బాషా (అమ్ముకుట్టి) తెలిపారు. గాయపడిన తనను ఎవరూ పట్టించుకోలేదని, ఆస్పత్రికి వెళ్లినా తగిన వైద్యసేవలు అందించలేదని పేర్కొన్నారు. బలిజల సమావేశమైనా అభిమానంతో వెళ్లానని, వేదిక ఎక్కిన తనను రాకూడదని సీఐ అనడం బాధాకరమన్నారు. సీఐ గంగిరెడ్డిని వివరణ కోరగా సభావేదికపై ఎక్కువ మంది ఉండడంతో కిందకు దిగాలని చెబుతూ వస్తుండగా కార్యకర్తలు, నాయకులు దిగుతూ రద్దీలో అతను విగ్రహంపై పడ్డాడని తెలిపారు. మంత్రి వెనుక ఎవ్వరూ ఉండవద్దని చెప్పానే గాని మతాల పేరు ఎత్తలేదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.