logo
Published : 29/11/2021 06:30 IST

పైసలు లేవు.. పనులు సాగవు

పేరుకున్న బకాయిలు 

ఉపాధి కూలీల నిరీక్షణ


ఉపాధి పనుల్లో కూలీలు (దాచిన చిత్రం)

చిన్నగొట్టిగల్లు మండలంలోని ఓ గ్రామంలో రామచంద్రయ్య తన తోటి రైతులతో కలిసి పొలంలో ఫారంపాండ్‌ తవ్వారు. ఒక్కొక్కరికి 15 రోజుల పనిదినాల చొప్పున ఏడుగురికి మొత్తం 105 రోజుల కూలీ రావాలి. రోజుకు సగటున రూ.220 లెక్కన రూ.23 వేలు అందాలి. రెండు నెలలైనా తమకు డబ్బులు అందలేదని, వెంటనే కూలి డబ్బు ఖాతాల్లో జమ చేయాలని వారు కోరారు.

బంగారుపాళ్యం మండలానికి చెందిన వెంకటేశులు తన పొలంలో ఉపాధిహామీ పథకం కింద మొక్కలు నాటించారు. ఇందుకు అప్పు చేసి కూలీలకు డబ్బులిచ్చారు. నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బిల్లుగానీ, కూలీల వేతనం గానీ మంజూరు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ) : ఉపాధిహామీ పథకం కింద పనిచేసిన కూలీలకు ఐదు వారాలుగా వేతనాలు అందలేదు. వర్షాల కారణంగా చేద్దామన్నా పనుల్లేవు. చెరువులు, వాగులు, వంకలు, కుంటలు అన్నీ నిండుకుండల్లా ఉండటం, పొలాలన్నీ జలమయం కావడంతో నెల రోజలుగా ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయి. నామమాత్రంగా గుట్టల్లో ట్రెంచ్‌లు తీయడం, పొలాల్లో మొక్కలు నాటే పనులు జరుగుతున్నాయి. వాటికీ గతనెల 23 నుంచి బకాయిలు ఉండటంతో కూలీలకు నిరీక్షణ తప్పడం లేదు.

రూ.25 కోట్ల బకాయిలు

జిల్లాలో ఉపాధి హామీ కింద 5,34,126 జాబ్‌కార్డులు ఉన్నాయి. వాటిలో 7,73,187 మంది కూలీలుగా నమోదయ్యారు. అందులో అవసరాన్ని బట్టి రెండు లక్షల మంది వరకు అప్పుడప్పుడూ పనికి హాజరవుతున్నారు. ఇందులో రైతులు వారి పొలాల్లో నాటిన మొక్కల తాలూకూ పనులకు సంబంధించిన కూలీలూ ఉన్నారు. ఇటీవల వర్షాలు అధికం కావడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు గణనీయంగా తగ్గాయి. పొలాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులతో కలిపి ఐదు వారాలుగా రోజకు సగటున 15వేల మంది కూలీలు పనికి హాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది సగటున ఒక్కో కుటుంబానికి 51.4 రోజుల పని కల్పించారు. 38,868 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. రోజుకు సగటున గరిష్ఠ వేతనం రూ.233.05గా నమోదైంది. ఈ లెక్కన రూ.25 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. కూలీలకు వేతనాలుగా అందిన(అందించనున్న) మొత్తంలో 61.07 శాతం కూలీల వేతనాలుగా, 38.93 శాతం వస్తు సామగ్రి నిధి(మెటీరియల్‌ కాంపొనెంట్‌) కింద లెక్కించారు.

ఒకటి రెండ్రోజుల్లో జమ చేస్తాం

ఉపాధి హామీ పథకంలో ఐదు వారాలుగా బకాయిలు ఉన్నాయి. అవి ఎంత మొత్తం అనేది కచ్చితంగా చెప్పలేం. బకాయిలు ఒకట్రెండ్రోజుల్లో కూలీల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. -రామాంజనేయరెడ్డి, డ్వామా ఏపీడీ, చిత్తూరు

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని