logo
Published : 29/11/2021 06:30 IST

గేటు.. ముంపుచోటు

జలాశయాల నిర్వహణలో నిర్లక్ష్యం


కాళంగి జలాశయం గేట్ల నుంచి లీకవుతున్న నీరు

ఇటీవల కురిసిన భారీ వర్షం తర్వాత కల్యాణిడ్యాంలోని మూడోగేటును ఎత్తే సమయంలో రెండు అడుగులు పైకి లేచిన తర్వాత మొరాయించింది. కిందికి దించే సమయంలో సమస్య తలెత్తింది. గేటు మొత్తం ఎత్తిన సమయంలో దిగువన ఉన్న 11 కేవీ లైన్లు కొట్టుకుపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ పనిచేయకపోవడంతో రాత్రి 12 గంటల సమయం నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు నీరు దిగువకు వెళ్లిపోయింది. దాంతో దిగువన ఉన్న మత్స్యశాఖకు చెందిన చేప పిల్లల సరఫరా కేంద్రంలోని 15 లక్షల చేపలు వరదలో కొట్టుకుపోయాయి. పీటీసీ నుంచి మరో లైను ద్వారా విద్యుత్తు ఏర్పాటు చేసిన తర్వాత గేట్లను దించారు.

2015లో వరదలు వచ్చిన సమయంలో కేవీబీపురం మండలంలోని కాళంగి నదిలోని గేట్లు కొట్టుకుపోయాయి. ఆ తర్వాత వాటిని తిరిగి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మళ్లీ వాటి నిర్వహణపై అధికార యంత్రాంగం దృష్టిసారించలేదు. వరదలు వచ్చాయంటే నిత్యం ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలలో ఉంటున్నారు. ఇటీవల వర్షాలు కురిసిన సమయంలోనూ గేట్లు పైకి ఎత్తిన సమయంలో బాగానే పనిచేశాయి. దింపే సమయంలోనే సమస్య ఏర్పడింది. దాంతో జలాశయంలోని నీరు దిగువకు వెళ్లిపోయాయి. ఇప్పటికీ గేటు నుంచి నీరు లీకవుతూనే ఉంది.

ఈనాడు-తిరుపతి : జిల్లాలోని జలాశయాల నిర్వహణపై జలవనరులశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జలాశయాలపై నీటి ప్రవాహం వచ్చిపడుతోంది. దీనివల్ల సకాలంలో గేట్లు ఎత్తకుండా, దించకుండా ఉన్నా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ముంపు సమస్య ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కల్యాణి డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తే నేరుగా తొండవాడ దగ్గర స్వర్ణముఖి నదిలో కలుస్తాయి. నదిపై నిర్మించిన వంతెనలు కూలిపోవడానికి గేట్ల నిర్వహణ లోపం ఒక కారణమన్న విమర్శలు ఉన్నాయి.

అరణియార్‌ ప్రాజెక్టు వద్ద నాల్గో గేటు స్విచ్‌ పనిచేయట్లేదు. మాన్యువల్‌గానే గేట్లు దించి ఎత్తాల్సిన పరిస్థితి నెలకొంది. భారీ వరద ఒకేసారి వస్తే త్వరితగతిన ఎత్తాలంటే సమస్య ఏర్పడనుంది.

కృష్ణాపురం జలాశయం వద్ద గేట్ల సమస్య నెలకొంది. ఇక్కడ రెండు గేట్లు పనిచేస్తున్నా.. ఒక్కోసారి గేట్లు ఎత్తేటప్పుడు నిలిచిపోతోంది. ఎన్టీఆర్‌ జలాశయం గేట్లకు ఎలాంటి సమస్య లేకున్నా ప్రాజెక్టు మోటార్లు ఏర్పాటు చేసిన చోట్ల రేకులు అన్నింటికీ చిలుము పట్టిపోయాయి. వీటిని బాగు చేయకుంటే రానున్న రోజుల్లో మోటార్లు దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. మోటార్లు పనిచేయకుంటే గేట్లు ఎత్తేందుకు వీలుండదు. అధికారులు జోక్యం చేసుకుని జలాశయాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

చిన్నచిన్న సమస్యలున్నాయి

ప్రాజెక్టుల నిర్వహణ బాగానే ఉంది. కొన్నిచోట్ల చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా నిర్వహణ చేడతాం. ఇందుకు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తాం. - హరినారాయణరెడ్డి, సీఈ, జలవనరులశాఖ

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని