logo
Published : 02/12/2021 03:47 IST

అన్నదాతకు పరిహారం దక్కేదెలా ?

ఈకేవైసీకీ 11 శాతం మంది దూరం

ఏర్పేడు మండలం కృష్ణంపల్లె సమీపంలో దెబ్బతిన్న మిరప

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలో ఇటీవల వరదలకు కర్షకుల రెక్కల కష్టం వర్షార్పణమైంది. వరి పంట మొలకెత్తింది. చేతికొచ్చిన టమోటా, కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ప్రభుత్వం అందజేసే పరిహారంపై ఆశలు పెట్టుకున్న వారిని ఈ-పంట, ఈకేవైసీ వంటి నిబంధనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు అధికారులు క్షేత్రస్థాయికెళ్లకుండానే చరవాణి ద్వారా సమాచారం తెప్పించుకుని పంట నష్టం లెక్కింపు చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 25వేల ఎకరాల్లో వరి, మిరప; 7,200 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రైతులు పంటలు సాగుచేసిన తర్వాత ఈ-పంట, ఈకేవైసీ పూర్తి చేస్తేనే పంట నష్టపోయినప్పుడు పరిహారం, బీమా సొమ్ము అందుతుంది. ఖరీఫ్‌లో పంటలు సాగు చేసి ఈ-కర్షక్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్న రైతులు మరోసారి వేలిముద్ర (బయోమెట్రిక్‌)వేయడం ద్వారా నిర్ధారించుకోవాలి. వేలిముద్ర వేస్తే ఈ-పంట ప్రక్రియ పూర్తయి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు అర్హులవుతారు. జిల్లాలో ఇప్పటి వరకు 89 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తిచేసుకున్నారు. డిసెంబరు నెల ప్రారంభమైనా 11 శాతం మంది దీనికి దూరంగా ఉన్నారు. రైతులు అందుబాటులో లేకపోవడం, వృత్తిరీత్యా దూరంగా ఉండటంతో వంద శాతం చేయలేకపోతున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

మేల్కోకుంటే అనర్హులే

వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పంట నష్టం లెక్కింపు చేపడుతున్నారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు ఈ-పంట నమోదు, ఈకేవైసీ పూర్తయి ఉండాలి. పంట నష్టపోయిన రైతు అయినప్పటికీ ఈ-పంట నమోదు, ఈకేవైసీ కాకుంటే పరిహారం అందదు.

ఉద్యాన రైతులకు ప్రశ్నార్థకమే..

టమోటా, కూరగాయలు, పండ్లు, పూల తోటలు 7,200 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో ఉద్యాన పంటల సాగు వివరాలు పూర్తిగా ఈ-పంటలో నమోదు కాకపోవడంతో రైతులకు పరిహారం అందే పరిస్థితి లేదు. అలాగే ఖరీఫ్‌ మొదట్లో సాగు చేసిన పంటను పలు కారణాలతో తొలగించి.. రెండో విడతగా వేసిన పంట వర్షానికి దెబ్బతిని నష్టపోయిన రైతులకు పరిహారం అందదు. ఉద్యాన పంటలు కోల్పోయిన వారందరికీ పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.

గుర్రంకొండ మండలంలో రైతుల వేలిముద్ర నమోదు

తప్పనిసరి చేసుకోవాలి

పంట నష్టపరిహారం పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. రైతులు వేలిముద్ర వేస్తేనే ఈకేవైసీ పూర్తవుతుంది. పంట నష్టపోయాక ఈ-పంట నమోదు, ఈకేవేసీ చేయడం కుదరదు. ఈ-పంటలో నమోదైన రైతులకే ఈకేవైసీకి అవకాశం ఉంటుంది. రైతులు ఆర్‌బీకేల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. - దొరసాని, జేడీ, వ్యవసాయ శాఖ

జిల్లాలో పంటలకు సంబంధించిన ఈ-కేవైసీ వివరాలు

ఈ-పంట నమోదైన విస్తీర్ణం : 2,68,724 హెక్టార్లు

నమోదైన రైతుల సంఖ్య : 3,24,178

ఈ-కేవైసీ చేయించుకున్నవారు: 2,86,246(89%)

మిగిలిన వారు: 37,932

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని