Thirumala: తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు పడే ప్రాంతాలను గుర్తించిన నిపుణుల బృందం
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు పడిన ప్రాంతాన్ని ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ కేఎస్ రావుతో కూడిన బృందం కనుమదారిని పూర్తిగా పరిశీలించారు. భారీ బండరాళ్లు పడిన భాష్యకారుల సన్నిధి ప్రాంతంలో మరో బండరాయి పడే అవకాశం ఉండటంతో డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కేఎస్ రావు మాట్లాడుతూ... ఎగువ ఘాట్రోడ్డులో కొండచరియలు పడే 12 ప్రాంతాలను గుర్తించామన్నారు. ప్రస్తుతం దెబ్బతిన్న రోడ్డును అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించి మరమ్మతులు చేయవచ్చని తెలిపారు. అధిక వర్షాల కారణంగానే ప్రమాదం జరిగిందని, 30 నుంచి 40 టన్నుల బరువున్న బండరాళ్లు కొండపై నుంచి జారిపడ్డాయని వివరించారు. దెబ్బతిన్న రోడ్డును పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు 3 నెలలకుపైగా సమయం పట్టే అవకాశముందన్నారు. మరో మారు పరిశీలించి పూర్తి నివేదికను తితిదేకు సమర్పిస్తామన్నారు. తిరుమలకు ప్రత్యామ్నాయ రహదారి ఉంటే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో వైపు ఘాట్రోడ్లో పడిన బండరాళ్లను తితిదే తొలగిస్తోంది. లింకు రోడ్డు వద్దకు భారీ బండరాళ్లు దొర్లుకుంటూ రావడంతో ఆ ప్రాంతంలో మరి కొన్ని చెట్లు, రాళ్లు పడిపోయాయి. రాళ్లను యంత్రాల సాయంతో పగులగొట్టి తొలగిస్తున్నారు.