logo

వారధి.. ఏదీ నిధి ?

తిరుపతి జిల్లాలో గతనెలలో కురిసిన వర్షాలకు ఎన్నడూలేనంత నష్టం జరిగింది. గతేడాది సైతం నవంబరు నెలలో నివర్‌ తుపాను ప్రభావంతో పడిన వానలకు రహదారులు, కాజ్‌వేలు, వంతెనలు దెబ్బతిన్నాయి.

Published : 05 Dec 2021 05:59 IST

 గతేడాది దెబ్బతిన్న వాటికే మరమ్మతులు చేయని వైనం

 ఈ ఏడాదీ నష్ట

పాకాల మండలం చంద్రగిరివారిపల్లి వద్ద కొట్టుకుపోయిన రహదారి

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు, ఈనాడు, తిరుపతి జిల్లాలో గతనెలలో కురిసిన వర్షాలకు ఎన్నడూలేనంత నష్టం జరిగింది. గతేడాది సైతం నవంబరు నెలలో నివర్‌ తుపాను ప్రభావంతో పడిన వానలకు రహదారులు, కాజ్‌వేలు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయలేదు. గతనెలలో వర్షాలకు దెబ్బతిన్న వాటికి ఎప్పుడు మరమ్మతులు చేస్తారో తెలియని పరిస్థితి.

ఈ చిత్రంలో కూలిన వంతెన నాగలాపురం మండలం లోనిది. నాగలాపురం- నారాయణరాజు కండ్రిగ గ్రామాల మధ్యలో.. ద్వారకానగర్‌ సమీపంలో 1999లో రూ.40 లక్షలతో నిర్మించారు. నివర్‌ తుపానుతో ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయింది. రూ.5 లక్షలతో పైప్‌లు వేసి.. మట్టి వేసి తాత్కాలిక పనులు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కొట్టుకుపోగా.. పైప్‌లు మిగిలాయి.

టెండర్ల దశకు.. నాలుగు వంతెనలే

గతేడాది నివర్‌ తుపాను సమయంలో జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారులకు రూ.110 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పుంగనూరు, తంబళ్లపల్లె, సత్యవేడు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ పరిస్థితి నెలకొంది. తాత్కాలిక మరమ్మతులకు రూ.5.27 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. 11 వంతెనలకుగాను ప్రభుత్వం నాలుగింటికే రూ.22.50 కోట్లు మంజూరు చేసింది. పుంగనూరు- పులిచెర్ల- చిన్నగొట్టిగల్లు మార్గంలో సదుం వద్ద, ఇదేమార్గంలోని ఇరికిపెంట సమీపంలో, పీలేరు- సదుం రోడ్డులో పాపిరెడ్డిపల్లి వద్ద, కలకడ- కలికిరి మార్గంలో ఓ వంతెనకు అనుమతులు వచ్చాయి. వీటికి టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈక్రమంలోనే సదుం- జాండ్రపేట మధ్య రూ.90 లక్షలతో తాత్కాలికంగా నిర్మించిన వంతెన ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయింది. సత్యవేడు నియోజకవర్గంలో కూలిన వంతెనలకు మోక్షం కలగలేదు. గంగాధరనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న కాజ్‌వేలపై.. మట్టి చల్లి మమ అనిపించారు.

ఈ ఏడాదీ 72 చోట్ల అదే పరిస్థితి

ఈ ఏడాది నవంబరులో పడిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ పరిధిలో ఏకంగా 539 కి.మీ మేర నష్టం వాటిల్లింది. మొత్తంగా 72 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. పూతలపట్టు, కలికిరి, వెదురుకుప్పం, తిరుపతి గ్రామీణ, చంద్రగిరి, బి.కొత్తకోట మండలాల్లోనైతే రహదారులే కొట్టుకుపోయాయి. పూతలపట్టు మండలంలో భీమా నదిపై ఉన్న వంతెన కుప్పకూలిపోయింది. నగరి- కీళపట్టు మార్గంలోనూ ఇదే పరిస్థితి. నివర్‌ తుపాను వచ్ఛి. ఏడాది గడిచినా కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులూ చేయలేదు. ఈనేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు ప్రతిపాదనలు పంపితే.. నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి ఉంది.

ప్రతిపాదనలు పంపాం

గతేడాది, ఈ ఏడాది దెబ్బతిన్న రహదారులు, వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. కొన్నిచోట్ల నిధులు విడుదలయ్యాయి. మిగతావాటికీ నిధులు మంజూరైన వెంటనే పనులు చేస్తాం. -దేవానందం, ఆర్‌ అండ్‌ బీ, ఎస్‌ఈ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని