logo

రెవెన్యూ పాపం.. పేదలకు శాపం

సత్యవేడు రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు ఎస్సీ, ఎస్టీలకు శాపంగా మారాయి. పరిశ్రమకు భూములు త్యాగం చేసినా పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని చిన్నపాండూరు రెవెన్యూలో సర్వేనం.44లో 374 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. చిన్నపాండూరు పంచాయతీ వీకేఆర్‌వైకాలనీకి చెందిన 126

Published : 17 Jan 2022 03:13 IST

భూపరిహారంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం


అన్యాయం జరిగిందంటూ నిరసన చేపట్టిన వీకేఆర్‌వై కాలనీ గిరిజనులు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, వరదయ్యపాళెం, సత్యవేడు రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు ఎస్సీ, ఎస్టీలకు శాపంగా మారాయి. పరిశ్రమకు భూములు త్యాగం చేసినా పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని చిన్నపాండూరు రెవెన్యూలో సర్వేనం.44లో 374 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. చిన్నపాండూరు పంచాయతీ వీకేఆర్‌వైకాలనీకి చెందిన 126 గిరిజన కుటుంబాలకు 1995లో 1.50 ఎకరా చొప్పున.. 2009లో రెండో విడత భూపంపిణీలో మరో 44మందికి ఎకరా చొప్పున పంపిణీ చేశారు. 1995లో ఇదే రెవెన్యూలోని భూమిని సమీపంలోని రాచర్లకు చెందిన 90మంది ఎస్సీలకు భూ పంపిణీ కింద పట్టాలు ఇచ్చారు. అయితే వారికి ఇంత వరకు భూములు చూపలేదు. ఇదిలా ఉండగా వీకేఆర్‌వైకాలనీకి చెందిన గిరిజనులకు ఇచ్చిన భూముల్లో సీఎల్‌డీపీ పథకం కింద భూ అభివృద్ధి పనులు చేపట్టారు. కొంత భూమిలో ప్రభుత్వం ద్వారా మామిడితోటల పెంపకాన్ని చేపట్టారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను సైతం నూతన సెజ్‌గా కేటాయించారు. అందుకు లబ్ధిదారులు అంగీకరించారు. భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పుడే రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పాల్పడిన భూకుంభకోణం వెలుగు చూసింది.

ఒకే భూమి.. ముగ్గురు లబ్ధిదారులు

ప్రభుత్వం భూపంపిణీ కింద దళిత, గిరిజన కుటుంబాలకు ఇచ్చిన భూములపై పట్టాలు లబ్ధిదారుల వద్దే ఉండగా.. అదే భూములపై నాటి రెవెన్యూ అధికారులు కుంభకోణానికి తెర లేపారు. భూములున్నది కేవలం 374 ఎకరాలైతే, పట్టాలు ఇచ్చింది 450 ఎకరాలకు. పేదలకు ఇచ్చిన భూములపై పట్టాలను రద్దు చేయకనే, అదే భూములపై స్థానికులతో పాటు, స్థానికేతరులకు సైతం పట్టాలు ఇవ్వడం గమనార్హం. దీంతో ఒకే భూమిపై ఇద్దరు, ముగ్గురికి పట్టాలు సృష్టించారు. ఇలా ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో ఇతరులకు సైతం పట్టాలు ఇవ్వడంతో ఒకేభూమిపై ఇద్దరికి పట్టాలు ఉన్న కారణంగా పరిహారం నిలుపుదల చేశారు. అవినీతి కుంభకోణానికి ప్రమేయం ఉన్న అధికారిని అప్పట్లో బదిలీ చేసినా, సెజ్‌ భూసేకరణ ప్రక్రియలో ఆయననే కొనసాగించడంతో ఈ భూ అక్రమాలు మరింత విస్తరించాయని విమర్శలు వచ్చాయి. తమకు న్యాయం చేయాలని గిరిజనులు, దళితులు ఆరేళ్లుగా చిత్తూరు, తిరుపతిలోని పాలనాధికారి, ఉపపాలనాధికారుల వద్దకు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. పలుమార్లు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవలే రాచర్ల ఎస్సీలు నిరాహారదీక్ష చేపట్టడం తెలిసిందే. నిబంధనలను తుంగలో తొక్కి దొడ్డిదారిలో పట్టాలు మంజూరు చేసినందుకు ఇద్దరు తహసీల్దార్లు, ఇద్దరు ఆరైలు, ఇద్దరు వీఆర్వోలపై కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని