logo

మట్టి మాఫియా !

చంద్రగిరి గ్రామీణ జిల్లా ఇటు తమిళనాడు అటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉండటం అక్రమార్కులకు వరమైంది. తూర్పు ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తమిళనాడు ప్రాంతానికి తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా కొన్ని ప్రాంతాల్లో కొండలను తొలగిస్తుంటే.. మరికొన్నిచోట్ల ఇచ్చిన అనుమతులను

Published : 17 Jan 2022 03:13 IST

నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా

అడ్డుకోవడంలో అధికారుల విఫలం

చంద్రగిరి మండలం చిన్నరామాపురం పరిసరాల్లోని దరఖాస్తు పట్టా భూముల్లో మట్టి తవ్వకాలు

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, చంద్రగిరి గ్రామీణ జిల్లా ఇటు తమిళనాడు అటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉండటం అక్రమార్కులకు వరమైంది. తూర్పు ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తమిళనాడు ప్రాంతానికి తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా కొన్ని ప్రాంతాల్లో కొండలను తొలగిస్తుంటే.. మరికొన్నిచోట్ల ఇచ్చిన అనుమతులను మించి తవ్వకాలు చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులను అడిగితే ఇది తమ పరిధిలోకి రాదని, మైనింగ్‌ అధికారులు చూసుకుంటారంటూ చెప్పి మిన్నకుండి పోతున్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మైనింగ్‌ అధికారులు వీటిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి లేదు. దీంతో అక్రమార్కులు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

తూర్పు మండలాల నుంచి...

తూర్పు ప్రాంతానికి తమిళనాడు గ్రామాలు సరిహద్దుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి ఇప్పటికే ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు. దీనికి తోడు మట్టిని కూడా తోడేస్తున్నారు. ఇటీవలి వరకు పుత్తూరు మండలం అంజమ్మ కనుమ ప్రాంతం నుంచి ఇష్టానుసారంగా తరలిస్తూ వచ్చారు. అటు వరదయ్యపాళెం పరిధిలోని చిలమత్తూరు, బత్తులవల్లం పరిధిలోనూ మట్టిని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారన్న విమర్శలున్నాయి. అధికారులు పట్టించుకోక పోగా.. ఒకవేళ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా అధికార పార్టీకి చెందిన వ్యక్తులకే అడ్డుచెబుతారా అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రగిరి మండలంలోని చిన్నరామాపురం పంచాయతీలో నివాసముంటూ చిన్నగొట్టిగల్లు మండలంలో రెవెన్యూలో పనిచేస్తున్న ఓ అధికారి అండతోనే ఇటుక బట్టీలకు మట్టి అమ్మకాలు సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి గ్రామీణ మండలం చెర్లోపల్లి పరిసరాల్లో ఇటుక బట్టీలు అధికంగా ఉండటంతో టిప్పర్‌ మట్టిని రూ.5 వేలు నుంచి రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

చంద్రగిరి మండలం చిన్నరామాపురం పంచాయతీ పరిధిలోని భీమవరం, ఎగువ కూచువారిపల్లి ప్రాంతాల్లో మట్టి, ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుంటున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నరామాపురానికి చెందిన అధికార పార్టీ నేత పట్టపగలు ఇసుక, మట్టి తరలిస్తున్నా.. అడిగేవారు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. భీమవరం గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 13లో దరఖాస్తు పట్టా భూములుండగా అక్కడ నుంచి మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

సత్యవేడు పరిధిలోని కొల్లడం, అల్లపగుంట, మదనంజెరి, బాలకృష్ణాపురం, చెన్నేరి తదితర ప్రాంతాల నుంచి మట్టి తరలిస్తున్నారు. కొన్నింటికి అనుమతులు ఉన్నా ఇచ్చిన దానికంటే పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు కనీసం అక్కడికి వెళ్లి పరిశీలించే సాహసం చేయని పరిస్థితి నెలకొంది.

తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి ప్రాంతంలోనూ ఇటీవలి వరకు యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. కొండలను సైతం తోడేశారు.

చర్యలు చేపడుతున్నాం

ఇసుక అక్రమ రవాణాపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి పట్టుకుంటున్నాం. ఎక్కడైనా మట్టి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు చేపడతాం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, మైనింగ్‌ శాఖతో సమన్వయం ఏర్పర్చుకుని పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. - కనక నరసారెడ్డి, ఆర్డీవో, తిరుపతి

చంద్రగిరి మండలంలో మట్టి తరలిస్తున్న టిప్పరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని