logo

కన్నవారికి కడుపుకోత

రెండు కుటుంబాలకు ఒక్కొక్కరే మగబిడ్డలు. వారిద్దరినీ రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యవు కబళించింది. బంధువులైన ఇద్దరూ ద్విచక్రవాహన ప్రమాదంలో మృత్యువాతపడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఉద్యోగంలో స్థిరపడుతున్న కుమారుడు ఇక లేడన్న నిజాన్ని తట్టుకోలేక ఓ కుటుంబం తల్లడిల్లగా.. బాగా చదువుతున్న

Published : 17 Jan 2022 03:13 IST
కుమారులను కోల్పోయిన కుటుంబాలు

 
సోదరితో ఇస్మాయిల్‌, పక్కన సిద్దిక్‌ (పాతచిత్రం)

మదనపల్లె(నేరవార్తలు): రెండు కుటుంబాలకు ఒక్కొక్కరే మగబిడ్డలు. వారిద్దరినీ రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యవు కబళించింది. బంధువులైన ఇద్దరూ ద్విచక్రవాహన ప్రమాదంలో మృత్యువాతపడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఉద్యోగంలో స్థిరపడుతున్న కుమారుడు ఇక లేడన్న నిజాన్ని తట్టుకోలేక ఓ కుటుంబం తల్లడిల్లగా.. బాగా చదువుతున్న కుమారుడ్ని మృత్యువు తమకు దూరం చేసిందన్న ఆలోచన మరో కుటుంబాన్ని కలచివేసింది. ఈ విషాదకర సంఘటన మదనపల్లె రూరల్‌లో ఈనెల 14వ తేదీ రాత్రి జరిగింది. వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన ఇమామ్‌హుస్సేన్‌ టైలర్‌గా పనిచేస్తూ తన ఇద్దరు కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడు ఇస్మాయిల్‌(23)ను పోషిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇస్మాయిల్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా చేరాడు. సంక్రాంతి సెలవులకు వారం రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఇదే ప్రాంతానికి చెందిన నౌషాద్‌ కుమారుడు సిద్ధిక్‌(18) కలికిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇస్మాయిల్‌కు సిద్ధిక్‌ స్వయానా మామ కుమారుడు. వీరిద్దరు ద్విచక్రవాహనంలో సొంతపనిపై మదనపల్లెకు వచ్చి 14వ తేదీ రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. ఎదురుగా మరో ద్విచక్రవాహనం రావడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇస్మాయిల్‌, సిద్ధిక్‌తో పాటు మదనపల్లె రూరల్‌ కొత్తవారిపల్లెకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు శ్రీనివాసులు(49) తీవ్రంగా గాయపడ్డాడు. ముగ్గురూ తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యువకులు ఇద్దరు ఒక్కో కుటుంబానికి ఒక్కొక్కరే మగపిల్లలు కావడంతో కుటుంబాల్లో విషాదం అలుముకుంది. కన్నబిడ్డల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాసులుకు భార్యా, ఇద్దరు ఆడపిల్లలున్నారు. కుటుంబ పెద్ద మృత్యువాత పడటంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. పండగ రోజే సంఘటనలు జరగడంతో కొత్తవారిపల్లె, చింతపర్తి గ్రామాల్లో విషాదం అలుముకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని