logo

పీఆర్సీని నిరసిస్తూ నేడు కలెక్టరేట్‌ ముట్టడి

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి సిద్ధమయ్యారు. జిల్లాలోని ఒకట్రెండు సంఘాలు మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సామాజిక మాధ్యమాల్లో

Published : 20 Jan 2022 05:26 IST

ముందస్తు అరెస్టులకు సిద్ధమైన పోలీసులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి సిద్ధమయ్యారు. జిల్లాలోని ఒకట్రెండు సంఘాలు మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో 10వేల మంది పాల్గొంటారని ఫ్యాప్టో నాయకులు ప్రకటించారు. ముట్టడి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వారిని ఎక్కడక్కడే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు సమాయత్తమైనట్లు తెలిసింది. వాహనాల్లో జిల్లా కేంద్రానికి వచ్చే వారిని రహదారులపై అదుపులోకి తీసుకోనున్నారు. బుధవారం రాత్రి పలువురిని అదుపులోకి తీసుకోవాలని సన్నద్ధమయ్యారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లి కార్యక్రమంలో నేరుగా పాల్గొంటారని సమాచారం.

‘ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం’

పీఆర్సీ ప్రకటనతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరిగిందని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐఆర్‌ కన్నా తక్కువ ఫిట్మెంట్‌ చేయడం ఇదే మొదటిసారని ఫ్యాప్టో జిల్లా కో-ఛైర్మన్‌ జీవీ రమణ తెలిపారు. అశుతోష్‌మిశ్రా కమిటీని ప్రభుత్వం బహిర్గతం చేయకుండా సీఎస్‌ సిఫార్సు చేసిన వాటిని అమలు చేయడం దారుణమన్నారు.

తీవ్ర నిరాశ మిగిల్చింది.. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ.. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఏపీ కళాశాలల విశ్రాంత అధ్యాపకుల సంఘం జిల్లా కార్యవరర్గ సభ్యుడు హరినాయుడు, ఉపాధ్యాయ పింఛనుదారుల సంఘం అధ్యక్షుడు శ్రీరామూర్తి వేర్వేరు ప్రకటనలో తెలిపారు. పింఛనుదారులు కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఎస్టీయూ సంఘీభావం

ప్లకార్డు ప్రదర్శిస్తున్న గంటా మోహన్‌

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు చేయాలంటూ గురువారం కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి సంఘీభావంగా ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు గంటా మోహన్‌ బుధవారం ఒకరోజు నిరహార దీక్ష చేపట్టినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివ్‌తో నాలుగు రోజులుగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, విధానాల అమలకు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ వైఖరి నిరాశజనకంగా ఉందన్నారు. తాజా పీఆర్సీ అమలులో దేశ చరిత్రలో మొదటిసారిగా రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు తగ్గే దయనీయ స్థితి ఏర్పడిందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని